Niranjan Reddy | హైదరాబాద్ : తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు నిరంజన్ రెడ్డి.
ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి. సిగ్గు పడాల్సినవి. తెలుగు దేశం పార్టీతో బీఆర్ఎస్ను పోల్చుతూ.. అది లేకుండా పోయింది.. ఇది కూడా పోతది.. అని వ్యాఖ్యానించారు. ఎవరో కుట్ర చేసి లేకుండా చేశారన్నడం ఆయన అవగాహన రాహిత్యం. ఆయనకు పరిపక్వత లేదనుకోవాలా..? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
తెలంగాణ నుంచి టీడీపీ కనుమరుగు కావడానికి చారిత్రాక కారణాలు ఉన్నాయి. తెలంగాణ అభిలాషను గౌరవించకపోవడం, వ్యతిరేకంగా నిలబడ్డందుకు టీడీపీని చాలా మంది నాయకులు వీడారు. మా ప్రాంతం గురించి పట్టింపు లేదు.. టీడీపీ అగ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకులు అని అర్థమైన తర్వాత ఆ పార్టీని ఏపీకి పరిమితం చేశారు. ఇది చరిత్ర అందరికీ తెలుసు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్న పార్టీ. కాంగ్రెస్ రాజకీయ చరిత్రపై, ఎమర్జెన్సీ అరాచకాలపై దేశ వ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడింది టీడీపీ. టీడీపీ పుట్టుకలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టినట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో రాజీ పడి ఉండొచ్చు అది వేరే అంశం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశంపై ప్రేమ వలకబోస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ.. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ.. అటువంటి టీడీపీ పట్ల సీఎం రేవంత్ సానుభూతి చూపించడంపై సీనియర్లు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించి ముందుకు పోవడం జీర్ణం చేసుకోని వ్యక్తి రేవంత్ రెడ్డి.. ఇది ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది. ఇవాళ పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేధావులు కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలి అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.