వనపర్తి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పలు ప్రాజెక్టులను పరిశీలించడంపై స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద కనీసం 4 టీఎంసీల రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేయకుండా, ఆంధ్రాలో మాత్రం 400 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించింది కాంగ్రెస్ కాదా? అని ప్ర శ్నించారు.
కేసీఆర్ తలపెట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటూ వందలాది కేసులు వేయించిన కాం గ్రెస్, ఇటీవలే వట్టెం పంప్‌హౌస్‌ను నిర్లక్ష్యంతో ముంచిందని విమర్శించారు. నెలరోజులైనా నీటి ని ఎత్తిపోయలేదని, పాలమూరు జిల్లాపై ఉన్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శమని అన్నారు. పది నెలల నుంచి పాలమూరు ప్రాజెక్టుల వైపు మంత్రులు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. ఉదండాపూర్ నుంచి గ్రావిటీతో కొడంగల్, నారాయణపేటకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా భేషజాలకు పోయి సీఎం రేవంత్‌రెడ్డి 6 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న జూరాలపై అదనపు భారం మోపుతున్నారని పేర్కొన్నా రు. మంత్రుల పర్యటనతో పాలమూరుకు ఒరిగేది ఏమీలేదని, బీఆర్ఎస్ ప్రశ్నలకు భయపడి హడావిడిగా ఏ ప్రణాళికలు లేకుండానే పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు. ట్రయల్న్ పూర్తయిన పంపుల ద్వారా నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను నీటితో నింపాలని, విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.