Koppula Eshwar | హైదరాబాద్ : తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిపై సమీక్ష చేశారు. సింగరేణి కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా భట్టి మాట్లాడారు. సింగరేణి పట్ల డిప్యూటీ సీఎం భట్టికి మరింత శ్రద్ధ ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రాంతం పట్ల, సింగరేణి సంస్థ పట్ల ప్రేమ లేదు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
సింగరేణిని కాపాడాలని కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 1400 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు, కార్పొరేట్ సంస్థలను కాపాడటం కోసం బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి దక్కాలని కేసీఆర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 4 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారు. 4 బొగ్గు బ్లాకులను కాపాడటం కోసం కేసీఆర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రయత్నం చేసింది. కేంద్రంలో బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి బొగ్గు బ్లాకుల వేలం పాటలో కలిసి
పాల్గొన్నారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకు ఎట్లా వచ్చింది. కర్ణాటకలో కాపర్, బంగారం గనులను సింగరేణి దక్కించుకుందని సింగరేణి సంస్థ ప్రకటించింది. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ సింగరేణికి ఏం చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సింగరేణి సంస్థలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు ఆధిపత్యం పెరిగింది. సింగరేణి నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. సింగరేణి సీఎండీ కాంగ్రెస్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సింగరేణిలో లాభాల వాటా ఏటా ప్రకటించడం ఆనవాయితీ. సింగరేణి కార్మికులకు 16 శాతం మాత్రమే పంపిణీ చేశారు. 35 శాతం లాభాల వాటా ఇప్పిస్తామని ఏఐటీయూసీ చెప్పింది. గత సంవత్సరం కంటే ఎక్కువగా 35 శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ లాభాల వాటాను 16 శాతం నుంచి 32 శాతం వరకు పెంచారు. సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ను కేసీఆర్ పునరుద్ధరణ చేశారు. డిపెండెంట్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. సింగరేణి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం సింగరేణి కార్మికుల్లో భరోసా నింపాలి. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలి. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి మోదీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కోల్ ఇండియా మేము నిర్వహించలేమని అంటున్న బొగ్గుబ్లాకులు ఇస్తామని అంటున్నారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ కక్షగట్టారు. భట్టి విక్రమార్క స్వయంగా వేలంలో పాల్గొన్నారు. సింగరేణిపై వివక్ష ఎందుకు. సింగరేణికి ఎందుకు బ్లాకులు ఇవ్వడం లేదు అని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు.