Koppula Eshwar | రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక కోతులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. డిసెంబర్ తర్వాత రూ.7500 అని చెప్పి నేటికీ ఇవ్వలేదని.. ఇప్పుడు సంక్రాంతికి ఇస్తామని మరోసారి రైతులను మభ్యపెడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రజాపాలన కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని.. అందులో రైతు భరోసా దరఖాస్తులు కూడా ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు తీసుకున్న రైతుల వివరాలు ఉండగా.. మళ్లీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించింది. ఇప్పుడు అభిప్రాయ సేకరణలో రైతుల సూచనలనే పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ.. రైతుల చేతుల వారి నెత్తిపైనే పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి సర్కారు రైతు భరోసా ఇచ్చేందుకు అనేక ఆంక్షలు పెడుతుందని.. ఇందులో భాగంగానే కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు తెరలేపిందన్నారు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రభుత్వం అభయహస్తం కోసం దరఖాస్తులు తీసుకుందని.. ఏ పథకం, వాగ్ధానాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతును యూనిట్‌గా తీసుకొని.. ప్రతి రైతుకూ రైతుబంధును అందించిందన్నారు. కానీ, కాంగ్రెస్ సర్కారు రైతు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటోందని.. గత ప్రభుత్వం ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెడుతూ ఏడు ఎకరాలుగా సీలింగ్ విధించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.