సూర్యాపేట, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది దేశంలోనే ఇప్పటివరకు లేనటువంటి ఓ చెత్త కేసు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆ కేసులో ఎవరికీ ఎక్కడా అవినీతి కన్పించడం లేదని తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసాపై రైతులు ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసులతో పక్కదారి పట్టించాలని చూస్తున్నదని ఆరోపించారు. రైతు సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ సహకారంతోనే రేవంత్ కేసులు పెడుతున్నారని, ఇవి చోటేభాయ్, బడే భాయ్ కలిసి ఆడుతున్న నాటకాలని దుయ్యబట్టారు. అక్రమ కేసులు పెడితే చివరకు రేవంత్‌రెడ్డి నేరస్థుడవుతాడని చెప్పారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు సంబంధించి ఆస్తులు, ఆదాయం కనిపిస్తుంటే.. ఏడాదిలో రూ.1.28 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు ఎటు పోతున్నాయో ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. అడ్డగోలు అప్పులు చేసి ఏఐసీసీకి కప్పం కడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి రాగానే కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని లెక్కలతో సహా బయట పెడుతామని పేర్కొన్నారు. త్వరలో అమలు చేస్తామంటున్న రైతుభరోసాలో అందరికీ ఇవ్వకపోతే వారి భరతం పట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ రైతులను రాజులుగా చూస్తే.. రేవంత్ వారిని దొంగల మాదిరిగా చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు, కేసులు, కొట్లాటలు కొత్తకాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగదీశ్‌రెడ్డి వెంట మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగల లింగయ్యయాదవ్ ఉన్నారు.