Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల యుద్ధం తప్పదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్‌కి రైతు భరోసా లేదన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. తుమ్మల ప్రకటనతో రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని.. రైతులను మోసం చేశారని స్పష్టంగా తేలిపోయిందన్నారు. రైతులను కేసీఆర్ నుంచి దూరం చేసి ఇప్పుడు వాళ్లని రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇన్ని రోజులు కుంటి సాకులు చెప్పి ఇప్పుడు చావు కబురు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. వాయిదాలు, ఓట్లు అయిపోయి మోసాలే మిగిలాయన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు కాంగ్రెస్ బాకీ పడిందని.. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. గల్లా పట్టి రైతులు వారి బాకీ వసూలు చేసుకోవడం ఖాయమన్నారు. మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి మోసం చేస్తారా ..? రైతుల తిరుగుబాటుకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.