Harish Rao | హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలలోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు నెలలోపు ఆస్పత్రులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన కొత్తపేట టిమ్స్ ఆస్పత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎందుకు రెండు సంవత్సరాల నుండి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కాలేదు. ఆనాడు మేము భూసేకరణ చేసి, టెండర్లు పిలిచి, డిజైన్లు పూర్తి చేసి, 6 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేసాము.. కానీ ఈ ప్రభుత్వం రెండేళ్లలో 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ ఆసుపత్రి గత ఏడాదే ప్రారంభమయ్యి ప్రజలకు సేవలు అందించేది. ఎక్కడ కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందో అని కావాలనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని స్లో చేస్తున్నారు. ముందు చూపు లేని మంద బుద్ది కలిగిన నాయకులు కాంగ్రెస్ నాయకులు అని హరీశ్‌రావు విమర్శించారు.
కేసీఆర్ హయాంలో మహేశ్వరం నియోజకవర్గంలో రూ.176 కోట్లతో మెడికల్ కాలేజీ, 500 పడకల ఆసుపత్రిని కట్టడానికి జీవో ఇచ్చాం. 27-09-2023 నాడు నేను, సబితక్క కలిసి వెళ్ళి ఆ మెడికల్ కాలేజీకి, 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కూడా చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని, 500 పడకల ఆసుపత్రిని రద్దు చేసి ఎల్బీ నగర్ టిమ్స్‌లో విలీనం చేశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవరంలో రూ.182 కోట్లతో ఇంకో మెడికల్ కాలేజీని కట్టాలని కేసీఆర్ జీవో ఇస్తే, ఈ ప్రభుత్వం అది రద్దు చేసి అల్వాల్ టిమ్స్‌లో కలిపారు. మేడ్చల్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాను అంటావు.. ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము బంద్ చేస్తాము అని చెప్తున్నారు. నీ పాలన ఎలా ఉంది అంటే.. కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాము.. కానీ నువ్వు వచ్చి రూ.1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి.. పేదలకు వైద్యం అందే లాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.