Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవం ఏమిటంటే, రైతు ఇంటికి, బ్యాంకుకు మధ్య తిరుగుతూనే ఉన్నరు. రుణమాఫీ విషయంలో చివరకు రైతుకు మిగిలింది ఒడువని దు:ఖం, తీరని అప్పు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఇగ రుణమాఫీ… అదొక దారుణ విషాద గాథ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్‌లో సంపూర్ణ రుణమాఫీకి కావాల్సింది. 49,500 వేల కోట్లుగా చెప్పారు. ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41 వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చనిఆరోజు చెప్పారు. భట్టి విక్రమార్క గత బడ్జెట్ ప్రసంగంలో 31 వేల కోట్ల రుణమాపీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20 వేల కోట్లు ఇచ్చాం అంటున్నరు. కానీ వాస్తవానికి అది 15, 16 వేల కోట్లు కూడాచేరలేదు. వాస్తవం ఏమిటంటే, రైతు ఇంటికి, బ్యాంకుకు మధ్య తిరుగుతూనే ఉన్నరు. చివరకు రైతుకు మిగిలింది ఒడువని దు:ఖం, తీరని అప్పు అని హరీశ్‌రావు అన్నారు.
అధ్యక్షా ఇంకా బాగా అర్థం కావాలంటే నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితే ఉదాహరణగా చెబుతా… బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది కేవలం 20,514 మంది. రుణమాఫీ కాని రైతులు 22,849. అంటే ఫైనల్ గా రుణమాపీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్యేఎక్కువ. ఇందులో 2లక్షల లోపు కానివారు 10,212 ఉండటం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వారు మీదున్నది కట్టండి. మిగతాది మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలునమ్మి చాలా మంది రైతులుఅప్పు తెచ్చి పైసలు కట్టిన్రు అధ్యక్షా. మా నియోజకవర్గవంలోనిగుర్రాలగొంది గ్రామంలో దమ్మర్ పల్లి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబిఐ బ్యాంకులో ఆగస్టు 30, 2024 నాడు రెండు లక్షల మీదున్న 50వేలు కట్టిండు. నారాయణ రావు పేటకు చెందిన జి సత్తి రెడ్డి అనే రైతు 2.60లక్షల రుణం ఉంటే, మిత్తితో కలిపి యూబిఐ బ్యాంకులో మీద 76 వేలు కట్టిండు. బంజేరుపల్లికి చెందిన మరో రైతు అక్తర్ ఖుస్రో 2 లక్షల 600 అప్పు ఉంటే, మిత్తితో కలిపి మీదున్న 10 వేలు కట్టిండు. వారికి ఈరోజు వరకు కూడా రుణమాఫీ కాలేదు, అప్పులే మీద పడ్డయి. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అధ్యక్షా అని హరీశ్‌రావు తెలిపారు.
దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.. ఈరోజుకూ వారికి రుణమఫీ కాలేదు, ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు. ఇంత చర్చ ఎందుకు భట్టి గారు.. మీ మధిరకు పోదామా? లేదా మా సిద్దిపేటకు వస్తారా? ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామోమీరే చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి నేను సిద్దం? మీరు సిద్దంగా ఉన్నారా? ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు. ఇవాళ కడుపు కట్టుకోనిది ఎవరో, అవినీతికి పాల్పడిందెవరో తెలుస్తున్నది అధ్యక్షా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.