Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ అప్పులు- వాస్తవాలను మరోసారి ప్రభుత్వం తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని.. రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని, శ్వేత పత్రలో క్లియర్‌గా మెన్షన్ చేశారన్నారు. మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే గవర్నమెంట్ హామీలేనివి, గవర్నమెంట్ కట్టనివి రూ.59,414 కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు. గవర్నమెంట్ హామీ ఉండి, గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రూ.95,462కోట్లు అని చెప్పారని.. అంటే ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పులు 1,54,876కోట్లు అని గుర్తు చేశారు.
సీఎం చెప్పిన రూ.6,71,757 కోట్ల అప్పుల నుంచి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేని రూ.1,54,876 కోట్లను తీసేస్తే మిగిలిన అప్పు రూ.5,16,881 కోట్లు మాత్రమేనన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రంలో రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72,658 కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించింది అని చెప్పారని.. రూ.5,16,881 కోట్ల ప్రభుత్వం కట్టాల్సిన అప్పు నుంచి వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్ల అప్పును తీసివేస్తే రూ.4,44,223 కోట్ల అప్పు ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.11,609కోట్లు అని తెలిపారు. ఈ మొత్తాన్ని కూడా రూ.4,44,223 కోట్ల నుంచి తీసివేస్తే.. రూ.4,32,614 కోట్లు మిగులుతుందన్నారు. శ్వేతపత్రంలో ఎఫ్ఆర్బీఎం అప్పులు మార్చి 31, 2024 వరకు ఉన్న బడ్జెట్ ఎస్టిమేట్స్‌ను తీసుకున్నారని.. శ్వేతపత్రం డిసెంబర్లోనే విడుదల చేశారనేది మనందరికీ తెలిసిందేనన్నారు.
ఈ శ్వేతపత్రంలో తెలివిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రూ.6,115 కోట్ల అప్పును బీఆర్ఎస్ ప్రభుత్వంలో జమ చేశారని.. కాంగ్రెస్ తీసుకున్న రూ.6,115 కోట్లను.. రూ.4,32,614 నుంచి తీసివేస్తే రూ.4,26,499 కోట్ల అప్పు మిగులుతుందన్నారు. అంటే తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనన్నారు. కానీ, పదే పదే రూ.6,71,757 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రూ.4.26 లక్షల కోట్లలో ఉదయం స్కీం రూ.9వేల కోట్లు, 2019-20 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు రూపంగా రూ.2,459కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీంతో పాటు కొవిడ్ సందర్భంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా, అప్పులు తీసుకునే స్థితికి కేంద్రం నెట్టిందని.. అందువల్ల రూ.17,558 కోట్ల అప్పు చేయాల్సిన అనివార్య పరిస్థితి తెలంగాణకు వచ్చిందని తెలిపారు. అదే విధంగా కోవిడ్ కారణంగా 2021-22 సంవత్సరంలో జీఎస్డీపీలో ఒకశాతం అధికంగా అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ మొత్తం రూ.10,784 కోట్లు అని.. తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా రూ.41,159 కోట్ల అప్పు తీసుకోవాల్సిన పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కొవిడ్‌తో నెట్టబడిందన్నారు. ఇది ఏ ప్రభుత్వమున్నా అనివార్యంగా చేయాల్సిన అప్పు అని హరీశ్‌రావు వివరించారు.