Harish Rao | హైదరాబాద్ : సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి నిర్మించిన గాలి మేడ ఈ బడ్జెట్. ఎన్నికల ముందు పాతాళ భైరవి… నరుడా ఏమి నీ కోరిక..?
ఎన్నికల తర్వాత… పాపాల భైరవి. నన్నేం అడుగకు, నాకేం తెల్వది. డిసెంబరు 9, 2023 వరకు అమలు చేస్తామన్న వాగ్దానాలు అమలుకావడానికి ప్రజలు ఇంకా ఎన్ని డిసెంబర్లు ఎదురు చూడాలో. రావాల్సిన డిసెంబరు అసలు వస్తుందో రాదో అనే అనుమానాలు ముసురుకున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్బాలు. వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్నసీఎం హేయమైన ప్రసంగాలను వినలేక జనం ఛీ కొడుతున్నారు. చెవులకు చిల్లులు పడుతున్నాయి గానీ చేయూత పించన్లకు చిల్లి గవ్వ రాలడం లేదు అని హరీశ్‌రావు విమర్శించారు.
ముఖ్యమంత్రి ఇదే అసెంబ్లీలో ఏమన్నారు అధ్యక్షా.. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెబుతున్నా… ఒక్కనొక్కనితోడ్కలు తీస్త,బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుత.’’ అన్నడు. నిండు సభలో చైర్‌ను ఉద్దేశించి చెప్పగల ముఖ్యమంత్రి సంస్కారం ఎంత గొప్పది అధ్యక్షా? ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మీరు పెట్టగలిగే పూర్తి స్థాయి బడ్జెట్లు నాలుగే. అందులో రెండు బడ్జెట్ లు పూర్తయి పోయాయి. మిగిలినవి రెండే… అంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతున్నది కానీ మీరు చూపించిన కలలు మాత్రం నిజమయ్యే దాఖలా కనిపించటం లేదు. మీ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరులు ఒకటొకటిగా తగ్గుతున్నాయి. మేము పెంచుతూ వచ్చిన ఆదాయాన్ని మీరు తగ్గిస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నది. అరచేతిలో వైకుంఠం చూపించిన అభయహస్తం మ్యానిఫెస్టో ఇక శూన్య హస్తమేనని మీ రెండు వార్షిక బడ్జెట్ లు తేల్చేశాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి – హరీష్ రావు pic.twitter.com/YE7zC9cgtG
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025