Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్లాగా ఉంది అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు.. కానీ అలాంటివి ఏవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై తెలంగాణ భవన్లో హరీశ్‌రావు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిటీ రిపోర్టు అంతా బేస్‌లెస్. అది ఒక ట్రాష్లాగా ఉంది. ప్రాజెక్టును రివ్యూ చేయడం ఒక సీఎం బాధ్యత. ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయం జోక్యం కాదు. ఈ రిపోర్టును చూస్తుంటే ట్రాష్, బేస్‌లెస్‌గా ఉంది. రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి రిపోర్టులు ఎన్నో వచ్చాయి. కానీ కోర్టుల్లో నిలబడలేకపోయాయి. ఇందిరా గాంధీ మీద అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్, చంద్రబాబు మీద కూడా అనేక కమీషన్లు వచ్చాయి. కానీ కోర్టుల్లో నిలబడలేకపోయాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఈ రిపోర్టులు. ప్రజాక్షేత్రంలో నిలబడలేవు, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తది. సత్యమే నిలబడుతది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కమీషన్లు, కేసుల పేరిట వరుసగా ఎలక్ట్రిసీటి స్కాం, కాళేశ్వరం కమీషన్, గొర్రెల స్కాం, ఈ కార్ రేసింగ్ అంటూ ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ప్రజలు తిగబడకుండా ఒక సీరియల్ మాదిరి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కార్తీక దీపం సీరియల్.. ఇది అయిపోగానే గుడి గంటలు, బ్రహ్మముడి సీరియల్ వస్తది. ఈ సీరియల్స్ మాదిరి నడిపిస్తున్నడు ప్రభుత్వాన్ని, ప్రజలకు నిజాలు చెప్పు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి, కేవలం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని, హింసించాలనే ధోరణితో రేవంత్ ఉన్నాడు. కానీ రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి మాత్రం లేదు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ మోటార్లు ఆన్ చేయడం లేదు, నీళ్లు ఇవ్వడం లేదు.. రైతులను ఇబ్బంది పెడుతున్నాడు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
2007 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు. ఇప్పుడు కూడా రెండేండ్లు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మంట్టి ఎందుకు ఎత్తలేదు. ఏ బేసిస్‌లో తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. నీటి లభ్యత లేదు. మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు తమ్మిడిహట్టి వద్ద. మేడిగడ్డ మీద మేం ప్రాజెక్టు కట్టేందుకు ఒక బేసిస్ ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారష్ట్రతో మూడు అగ్రిమెంట్లు చేసుకున్నాం. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు, నాటి నుంచి నేటి వరకు గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.