Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఈ 9 నెలల కాలంలోనే 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పాలనలో ఈ రోజు వరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లిస్ట్ అడిగితే గంటలో పంపించాను.. అయినా ఆదుకోలేదు.. స్పందించలేదు. నీ పాలన ఎలా ఉందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కిన తర్వాత ఒక మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఒక మాట.. పూటకో మాట మాట్లాడుతున్నావ్. పొద్దు తిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతున్నవ్. ఊసరవెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాయి. ఎన్నికల ముందు ఏం చెప్పవ్.. అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నావ్.. కుటుంబానికి ఒక్కరికే చేస్తా అని చెప్పలేదు కదా..? అని హరీశ్‌రావు నిలదీశారు.
ఎన్నికలు అయిపోయాక మాట్లాడుతూ.. ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే రూ. 49 వేల కోట్ల రుణాలు మాఫీ చేసేస్తా అన్నవ్. మరి ఎందుకు కోతలు పెడుతున్నావ్.. కేబినెట్ మీటింగ్ అయ్యాక నీవే ప్రెస్ మీట్ పెట్టి రూ. 31వేల కోట్లు 41 లక్షల మంది రైతులకు మాఫీ చేస్తా అన్నవ్. బడ్జెట్లో చూస్తే రూ. 26 లక్షల కోట్లు పెట్టావ్.. చేసిందేమో కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు లోగా రుణమాఫీ పూర్తి చేస్తా అంటివి. ఇవాళ రేషన్ కార్డు నిబంధన పెట్టి.. తల్లికి, పిల్లల మధ్య గొడవ పెడితివి. కుటుంబ బందాల మధ్య చిచ్చు పెట్టినవ్. నీ దరిద్రపు గొట్టు రాజకీయం వల్ల మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతున్నాయి. కేసీఆర్ పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసి కుటుంబ బంధాలను బలోపేతం చేశారు. కానీ నీవు కోతలు పెట్టడానికి రుణమాఫీ డబ్బు తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టన చరిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య : హరీశ్ రావు
HYDRAA | మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్.. హైడ్రా కూల్చివేతలపై ఓ మహిళ ఆక్రోశం : వీడియో