న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో ఎల్పీజీ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఒక వైపు ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాణిజ్య, గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు హోటళ్లు, వ్యాపార సంస్థలు, మెస్‌లు, హాస్టళ్లు మూతపడగా, మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఈ వంట గ్యాస్ సెగ ప్రముఖ హోటళ్లకు కూడా తగిలింది. గ్యాస్ కొరతతో దేశమంతటా సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌కు తెరలేచింది.
భారీ రేట్లకు గ్యాస్ అమ్ముతూ దళారులు దండుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో గ్యాస్ కొరత ఏర్పడగా, పెట్రోల్, డీజిల్‌కు కూడా కొరత వస్తుందన్న భయంతో పెట్రోల్ బంక్‌ల ముందు వాహనదారులు క్యూలు కడుతున్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ముందు పౌరులు సిలిండర్లతో క్యూలు కడుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు పలు పెట్రోల్ బంక్‌ల ముందు కూడా అలాంటి దృశ్యాలే కన్పిస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినా పౌరులు నమ్మినట్టు కన్పించడం లేదు.
బీహార్‌లో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ రూ.1,800, వాణిజ్య సిలిండర్‌ను రూ.4,000కు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లు రెస్టారెంట్లు ఇండక్షన్ స్టవ్‌లపై ఆహారపదార్ధాలను వండటం ప్రారంభించాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,918 ఉండగా, భోపాల్‌లోని బార్కేడా పటానీలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ బహిరంగంగానే రూ.4,000కు అమ్ముతున్నట్టు ఒక ఆంగ్ల మీడియా వెల్లడించింది. అలాగే రూ.918 ఉండే గృహావసరాల సిలిండర్‌ను రూ.1700 నుంచి 1,800కు అమ్ముతున్నారు.
బ్లాక్‌మార్కెట్‌ను నిరోధించడానికి ప్రభుత్వం అత్యవసర వినియోగదారుల చట్టాన్ని అమలు చేస్తున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీలు వాటిని పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ ఉద్యోగులు, బ్లాక్‌మార్కెటీర్లు, ఏజెన్సీ నిర్వాహకులు అప్పుడే గ్యాస్‌ను బ్లాక్‌లో అమ్మడం ప్రారంభించారు. అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసే వారు కూడా ఈ కొరత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. యూపీలో రోజంతా లైన్లో నిలబడినా లభించని సిలిండర్ కూడా 1,600 ఇస్తే వెంటనే దొరుకుతున్నదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
డెహ్రాడూన్, హల్దానీలలో గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ ధాబాలు, కార్ట్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తమ ఫుడ్ మెనూలోని 70 శాతానికి పైగా రకాలను ఆయా సంస్థలు తొలగించాయి. గ్యాస్ కొరతను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయాలపై వ్యాపార సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఇక హర్యానాలో గృహావసరాల సిలిండర్ మొన్నటి వరకు బుక్ చేసిన ఒకటి రెండు రోజుల్లో వచ్చేది. ఇప్పుడు వారం రోజులైనా వచ్చే పరిస్థితి లేదు.
హిసార్, సోనిపట్, ఫతేబాద్, హన్సీ, పానిపట్, కైతాల్, రెవారి, ఫరీదాబాద్ల్లోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట చాంతాడు క్యూలు ఉన్నాయి. రాజస్థాన్‌లోని భిల్వారాలో 50 శాతం రెస్టారెంట్లు మూతపడ్డాయి. పంజాబ్‌లో గ్యాస్ ఏజెన్సీల ముందు పౌరులు సిలిండర్లు పట్టుకుని బారులు తీరి ఉండటం కన్పించింది. రాజస్థాన్‌లో వాణిజ్య గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పలు రెస్టారెంట్లు, హోటళ్లు, మెస్‌లను మూసివేశారు. నగరంలో 400 రెస్టారెంట్లు ఉండగా, అందులో సగం గ్యాస్ కొరతతో మూసివేసినట్టు రాజస్థాన్ ఫుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వ్యాస్ చెప్పారు.
ఎల్పీజీకి తీవ్ర కొరత ఏర్పడటంతో పౌరులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వంటచెరకు, బొగ్గును వంటకు వినియోగించవచ్చు. అయితే ఇప్పుడు వాటి ధరలు కూడా వేగంగా పెరిగిపోయాయి. విద్యాహబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో మెస్, హాస్టల్ నిర్వాహకులు బొగ్గు, సంప్రదాయ కొలిమిలను వాడటం ప్రారంభించారు. సాధారణంగా మెస్‌లు, హోటళ్లు 35 నుంచి 40 కిలోల బరువుంటే కొలిమిలను తయారు చేస్తారు. అయితే ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరగడంతో అవి దొరకడం కష్టంగా మారింది. కొద్ది రోజుల్లోనే బొగ్గు డిమాండ్ 12 నుంచి 15 టన్నులకు చేరుకుందని ఒక వ్యాపారి తెలిపాడు.
గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, విద్యుత్ పొయ్యిలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక్క జైపూర్‌లోనే ప్రతి నెలా 2,500 నుంచి 3000 అమ్మే యూనిట్ల సంఖ్య 4,500కు పెరిగిందని ఒక వ్యాపారి తెలిపారు. గత కొద్ది రోజుల్లో అమెజాన్‌లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు 30 రెట్లు, ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రెట్లు పెరిగినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ కెటెల్స్, రైస్ కుక్కర్లు, ఇతర గృహోపకరణాలకు కూడా తీవ్ర డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌లకు మూడు రెట్ల డిమాండ్ పెరిగిందని ఎలక్ట్రానిక్ రిటైలర్ సంస్థ క్రోమా తెలిపింది. అలాగే తమ విద్యుత్తు గృహోపకరణాల అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగినట్టు స్టవ్‌క్రాఫ్ట్ అనే విద్యుత్తు ఉపకరణాల తయారీ సంస్థ వెల్లడించింది. ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లు, ఇతర పరికరాల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగిపోయాయి.
పశ్చిమ బెంగాల్లో గ్యాస్ కొరత ప్రభావం స్కూళ్లలోని మధ్యాహ్న భోజన పథకంపై పడింది. దీంతో అధికారులు భోజనం వండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ బ్లాక్‌మార్కెటింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. అస్సాంలో గ్యాస్, ఇంధన కొరతపై తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
దేశ వ్యాప్తంగా ఒక వైపు గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం లక్షలాది మంది గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నా కొరత ఏమాత్రం లేదంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. అనేక మంది పౌరుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా గ్యాస్ కొరత ఉన్న విషయం ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆమె విమర్శించారు. దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలతో పాటు యూపీలోని లక్నో, గోరక్పూర్ల్లో అటు వాణిజ్య, ఇటు గృహావసర గ్యాస్‌కు తీవ్ర కొరత ఉందని ఆమె తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు పడుతున్న పాట్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు.
భారత్‌లోని చాలా రెస్టారెంట్లు, హోటళ్లు ఎల్పీజీ మీద ఆధారపడే ఆహార పదార్ధాలను తయారు చేస్తున్నాయి. చిన్నపాటి రెస్టారెంట్లు రోజుకు రెండు 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తాయి. మధ్యస్థ స్థాయి హోటళ్లు మూడు నుంచి ఐదు సిలిండర్లు, పెద్ద హోటళ్లు ఆరు నుంచి 10 సిలిండర్లను వినియోగిస్తున్నాయి. వీరి స్టోరేజీ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ఎక్కువ సంఖ్యలో సిలిండర్లను ఉంచరు. దీంతో ఎల్పీజీకి కొరత ఏర్పడితే వారి వద్ద ఉన్న గ్యాస్ 48 నుంచి 72 గంటల అవసరాల మేరకు మాత్రమే సరిపోతాయి. ఒక వేళ గ్యాస్‌ను నిల్వ ఉంచుదామనుకున్నా వాటిని నిల్వ చేయడానికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. దీంతో ఎవరూ దాని జోలికే వెళ్లడం లేదు.
సంక్షోభాన్ని పట్టించుకోని కేంద్రం పార్లమెంట్లో విపక్ష ఎంపీల నిరసన
న్యూఢిల్లీ, మార్చి 12: ఎల్పీజీ కొరత దేశవ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్రంగా వేధిస్తున్నా.. మోదీ సర్కార్ నిస్సహాయంగా మారిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. సంక్షోభాన్ని పరిష్కరించకుండా మోదీ సర్కార్ చోద్యం చూస్తున్నదంటూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద గురువారం నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా సమస్య తీవ్ర రూపం దాల్చిందని, గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. మోదీ సర్కార్ సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. ఎల్పీజీ కొరత దేశవ్యాప్తంగా విస్తరించిందని, కోట్లాది మంది సామాన్యుల ఆహార భద్రత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించటంలో మోదీ సర్కార్ విఫలమైందని అన్నారు. సంక్షోభాన్ని అరికట్టేందుకు కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.