రణ్‌వీర్‌సింగ్ నటించిన ‘ధురంధర్-2’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తొలిభాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్: ది రివేంజ్’ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్లో బీజీఎమ్‌గా ఉపయోగించిన ‘ఆరి ఆరి’ అనే పాటను టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి తెచ్చారు.
శశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ఈ గీతాన్ని నవతేజ్ సింగ్ రెహాల్, ఖాన్‌సాబ్, జాస్మిన్ సండ్లాస్, సుధీర్ యదువంశీ ఆలపించారు. ఈ పాట తాలూకు మ్యూజిక్ వీడియో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దేశ సేవలో అజ్ఞాత వీరుల సాహసాలను ఆవిష్కరించే చిత్రమిదని, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ధర్ నిర్మించారు.