– ప్రశ్నిస్తే ఇళ్లపైకి వచ్చి బెదిరింపులు
– ఎక్సైజ్ అధికారులు స్పందించాలంటూ కాలనీవాసుల వేడుకోలు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 21 : పారిశ్రామికవాడ సారపాక పంచాయతీలోని భాస్కర్ నగర్లో గుడుంబా గుప్పుమంటుంది. భాస్కర్ నగర్లో వ్యాపారులు గుడుంబా తయారీ, విక్రయాలు చేస్తూ ప్రశ్నిస్తున్న వారిని బెదిరిస్తూ వారి ఇళ్లపై దాడికి సైతం ప్రయత్నిస్తున్నారని కాలనీ ప్రజలు, యువత భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో కొందరు వ్యాపారులు గుడుంబా విక్రయాలు యధేచ్చగా జరపడమే కాకుండా సమీపంలోని చేలల్లో గుడుంబాను తయారు చేస్తూ కాలనీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. గుడుంబా వల్ల ఎన్నో కుటుంబాలను నాశనమవుతున్న తరుణంలో కాలనీవాసులు, యువత తయారీ, విక్రయదారులను ప్రశ్నిస్తే అంతా తమ ఇష్టం గుడుంబా తయారీ, విక్రయాల విషయాలను మీడియా, సంబంధిత అధికారులకు తెలిపితే ఇళ్ల ముందుకు వచ్చి దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని కాలనీవాసులు వాపోతుననారు. ఈ ప్రాంతంలో గుడుంబా విక్రయాలు, తయారీ జరుగుతుందని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీంతో గుడుంబా రాయుళ్ల ఆగడాలు మరింత శృతిమించుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీసీకి పని నిమిత్తం వచ్చే వలస కార్మికులు సాయంత్రం, రాత్రయితే చాలు గుడుంబా తాగేందుకు వస్తుండడంతో గుడుంబా వ్యాపారం కారణంగా మహిళలు, చిన్నపిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తామని బెదిరిస్తున్న గుడుంబా వ్యాపారులపై తక్షణమే ఎక్సైజ్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భాస్కర్నగర్ వాసులు, యువత ముక్తకంఠంతో కోరుతున్నారు. గుడుంబా విక్రయాలపై ప్రశ్నించేందుకు వెళ్లగా బెదిరిస్తున్నారని, ఇళ్లపై దాడులు చేస్తామని అంటున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై భద్రాచలం ఎక్సైజ్ సీఐ కృష్ణయ్యను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా భాస్కర్నగర్లో ఎక్సైజ్ నుండి దాడులు చేస్తామని, గుడుంబా వ్యాపారాలు, తయారీ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.