Harish Rao | హైదరాబాద్ : గతంలో హెచ్‌సీయూ భూములపై అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు రూ. 170 కోట్ల లంచం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్లో సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూములపై ఫిర్యాదును ఇచ్చిన అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
2024 నవంబర్ 22న నాడు హెచ్‌సీయూ భూమిని తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా దుర్మార్గం ఏంటంటే.. ఈ అప్పు ఇప్పించడానికి బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తికి రూ. 169 కోట్ల 83 లక్షల అంటే సుమారుగా 170 కోట్లు బ్రోకర్ ఫీజు ఇప్పించారు. నేనేదో ఉట్టిగా చెప్పడం లేదు. నేను అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఇది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మి ఇంకో 40 వేల కోట్లు తేవాలని ప్రయత్నం చేస్తుండు. నియమ నిబంధల్ని ఉల్లంఘిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి చర్యలు, పనులు చేపట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఇది టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారు. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా భయం లేకుండా పోతున్నది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో కొత్త సెక్రటేరియెట్‌ను కట్టాలని నిర్ణయం తీసుకుంటే, పదో ఇరవయ్యో చెట్లను నరుకుతున్నారని గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారూ? వందల ఎకరాల్లో లక్షల కొద్దీ చెట్లు కొడుతున్న సీఎం గారిపై, సీఎస్ గారిపై, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నించిన పాపానికి వారిని జైళ్లో పెట్టారు, పది రోజులుగా వాళ్లు జైల్లో ఉన్నారు. దీనికి బాధ్యత హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదే. వాళ్లను విడుదల చేయమని ఉప ముఖ్యమంత్రి చెబుతారు ఎందుకో మరి? ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థులు చేస్తే అరెస్టు చేసి, జైల్లో పెడతారా? ప్రభుత్వం అన్ని చట్టాలనూ ఉల్లంఘిస్తున్నది. ఈ విషయాలన్నింటినీ మేం కమిటీకి నివేదించాం అని హరీశ్‌రావు తెలిపారు.
డీజీపీ గారూ… సీఎం గారిపై ఏ పోస్టు పెట్టినా వారిని జైల్లో పెడుతున్నారే.. మరి ఇవాళ వేలాది చెట్లు నరికినా, జింకలను చంపినా ఎందుకు కనిపించడం లేదు. జీవ విధ్వంసం మీ కళ్లకు కనిపంచడం లేదా.. ఎందుకు కేసులు పెట్టరు? నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివారూ నేరస్తులే. అందరూ కలిసే నేరం చేశారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఆ భూములు హెచ్‌సీయూకే చెందాలని మేం కమిటీకి విన్నవించడం జరిగింది. మేం కొట్టిన వాటిలో కేవలం సుబాబుల్ చెట్లు మాత్రమే ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. సుబాబులే కాదు.. సుగంధ పరిమళాలిచ్చే శాండల్ వుడ్ చెట్లు కూడా ఉన్నాయి. అనేక ఔషధ మొక్కలున్నాయి. ఈ భూముల్లో చెరువు కూడా ఉన్నది. హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.