Harish Rao | హైదరాబాద్ : ఇవాళ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న ఒకేఒక్క ఎర్రర్ కారణంగా.. టెర్రర్ను చవిచూపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తున్న వారి పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ, జైళ్ల పాలు చేస్తుందని మండిపడ్డారు. అడుగడుగునా అణచివేతలు ఉన్నాయన్నారు హరీశ్‌రావు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
రాహుల్ గాంధీ మొహబ్బత్ క దుకాన్ అని దేశం అంతా తిరుగుతున్నడు. రేవంత్ పాలన నఫ్రత్ కా మకాన్ గా మారింది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తదంటే జనం ఏమో అనుకున్నరు. ఎమర్జెన్సీ నాటి అణిచివేతలు, నిర్బంధాలు పునరావృతం అవుతాయని ఇప్పుడు స్పష్టమైంది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు ఏ గతి పట్టిందో, ఏడో గ్యారెంటీకి అంతకంటే అధ్వాన్నమైన గతి పట్టింది. ప్రశ్నిస్తే అరెస్టులా? నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలా? మా భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టవద్దన్నందుకు… లంబాడీ బిడ్డలపై లాకప్ హింసలా? రైతు చేతులకు బేడీలు వేసి తీసుకు వస్తరా. ఇదేనా ప్రజా పాలన అంటే? ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు చేసే హక్కు తొలగిస్తారా? ఎన్నికలకు ముందేమో ప్రజలారా స్వేచ్చగా పోరాడండి అన్ని వర్గాలను రెచ్చగొట్టారు, ఎన్నికలయ్యాక పోరాడే ప్రతి వారినీ చావగొడుతున్నారు. ఫిరాయింపులను నిలదీస్తే ఇండ్లపై దాడులు చేస్తారు. పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకోనివ్వకుండా ఇండ్లు కూలగొడుతారు. లైబ్రరీలో చొరబడి విద్యార్థుల వీపులు వాయగొడుతారు. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లకు పంపిస్తారు. శాసనసభ లోపల ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్లగొడుతుంది ఈ ప్రభుత్వం అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇక క్రైమ్ రేటు చూస్తే… ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కొలమానం. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఈ ఏడాది క్రైం రేటు 24శాతం ఎక్కువగా నమోదైందని మీరు పెట్టుకున్న డీజీపీనే చెబుతున్నారని సభకు హరీశ్‌రావు తెలిపారు.