Harish Rao | హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలను రేవంత్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఉద్యోగులపై లేదు అని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను తక్షణమే చెల్లిస్తాము అని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అయిదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది శీత కన్ను. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు అంటే చిన్న చూపు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడలేని విధంగా 42 శాతం పీఆర్సీ అందించిన ఘనత కేసీఆర్‌ది. రెండోసారి 31 శాతం పీఆర్సీ కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ మొత్తం 73 శాతం పీఆర్సీ ఇచ్చారు. కరోనా కంటే ముందు ఎప్పటి డిఏ అప్పుడే ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని డిఏలను తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఏరియర్స్ అన్ని తక్షణమే ఇస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకుని వస్తాం, ఆరు నెలల్లో పీఆర్సీ అందిస్తామన్నారు. నీవి బడాబడా మాటలు.. ఓట్లు ఐపోయినాక గజనీకాంత్ మాటలు అని హరీశ్‌రావు విమర్శించారు.
దేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఏలు పెండింగ్‌లో లేవు. ఐదు డిఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వివక్షకు ఇదే నిదర్శనం. 22 నెలలు గడుస్తున్నా పీఆర్సీ, డిఏ ప్రస్తావనే లేదు. పీఆర్సీ ఊసెత్తితే ఉద్యోగులపై ఉరిమురిమి చూస్తున్నావు రేవంత్ రెడ్డి. దసరా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి, డిఏ ప్రకటిస్తుందేమో అని ఆశగా చూశారు. వారిని తీవ్ర నిరాశకు గురి చేశారు. అభయ హస్తం కాస్త భస్మాసుర హస్తం అయింది. పోలీస్ కానిస్టేబుల్స్‌కు సరెండర్ లీవ్ వస్తే ఆ డబ్బుతో పిల్లల ఫీజులు కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీస్ సిబ్బందికి 5 ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఐదు సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 14 డీఎలు పెండింగ్ ఉన్నాయి. ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌కు రూ. 75 వేల అలవెన్స్ కేసీఆర్ అందించారు. పోలీస్ గౌరవాన్ని కాపాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ స్టేషన్‌కి చాలా అలవెన్స్ బంద్ చేసింది. పోలీస్ వాహనాల్లో పెట్రోల్ పోసే పరిస్థితి లేదు. పెట్రోల్ బంకుల్లో బకాయిలు చెల్లిస్తేనే పెట్రోల్ పోస్తామని పోలీసులను బెదిరించే పరిస్థితి వచ్చింది. పోలీసుల సరెండర్ లీవులు ఇవ్వకపోతివి, డిఏలు ఇవ్వకపోతివి, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బందు పెడితివి, చివరికి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కి కూడా డబ్బులు లేకుండా చేస్తివి. ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ సరెండర్ లీవులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హోంగార్డులపై మొదటి సంతకం పెట్టి పర్మినెంట్ చేస్తా అన్నావ్. 12000 ఉన్న హోంగార్డు జీతాన్ని 29 వేలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 75 రూపాయలు పెంచిండు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు అడిషనల్ అలవెన్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వమే అందించింది. ఏ రకంగా రేవంత్ రెడ్డి పోలీసులను వాడుకొని మోసం చేస్తున్నాడో మీరు గ్రహించాలి. పోలీసుల పెండింగ్ డిఏలు, సరెండర్ లీవులు చెల్లించాలని పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా ధర్నాలో వెళ్ళినప్పుడు వాళ్ల బాధలు మాకు వచ్చి చెప్పుకుంటున్నారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.