Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను బలంగా చేస్తే, కాంగ్రెస్ కుప్ప కూల్చింది అని మండిపడ్డారు.
గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లకు డిజిల్ పోయించే డబ్బులు లేక మూలన పడేసిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. బతుకమ్మ పండుగ పూట కూడా వీధిదీపాలు వెలగక గ్రామాలు చీకటిలో ఉన్నాయి. రహదారులు, డ్రైనేజీలు మరమ్మతులు లేక గ్రామాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గ్రామాల్లో సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విఘాతం. తెలంగాణ ప్రతీక బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. బతుకమ్మ పండుగ ఏర్పాట్లు లేవు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎమ్మెల్యేల ఎసీడీపీ నిధులు విడుదల చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటోంది ప్రభుత్వం. అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయి ప్రజలపై భారం పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కంటే ఎక్కువ ఢిల్లీలో ఉంటున్నారు.. పాలన గాలికి వదిలేశారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు కుట్రపూరితంగా గ్రామ పాలనను నాశనం చేసే రేవంత్ వైఫల్యం అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.