Harish Rao | సంగారెడ్డి : రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం. మూసీ మూసీ అన్నాడు మూడున్నర నెలలకే ఎల్లేలుకల పడ్డడు. హైడ్రా హైడ్రా అని ఆర్నెల్లు ఉరికిండు వెల్లకిలబడ్డాడు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాంపౌండ్‌లో గిరాకి లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదు. కెసిఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ పెరుగుడే పెరుగుడు.. రేవంత్ రెడ్డి పాలనలో దిగుడే దిగుడు. ఏమన్నంటే ఆర్ఆర్ టాక్స్. మెట్రో రైల్ వద్దన్నాడు, ఫార్మాసిటీ వద్దన్నాడు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఎటువంటి తెలంగాణను రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే వచ్చేది. కేసీఆర్ వచ్చాక పవర్ హాలిడేలు ఎత్తేసి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాడు. దేశానికి నెంబర్ వన్‌గా తెలంగాణ తీర్చిదిద్దింది కేసీఆర్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తెలంగాణ నుండి బియ్యాన్ని మాకు అమ్మండి అని అడిగేవారు.
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దారు కేసీఆర్. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుంది. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ ను విజయవంతం చేయాలని, పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కదిలి రావాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.