Harish Rao | సంగారెడ్డి : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెడితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేది. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జిఎస్టి వృద్ధిరేటు పడిపోయింది. దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించింది. కేసీఆర్ ఉన్నప్పుడు దేశ జిఎస్టి వృద్ధి రేటు కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నాం తప్ప తక్కువగా లేం అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి వాటిని నరుకుతున్నాడు. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లని నరికేసిండు. నిన్న హెచ్ సీయు భూముల్లో 400 ఎకరాల అడవుల్లోనూ నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడు.
ఏం పాపం చేశాయని మూగజీవాల ఉసురు పోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఒక చిన్న పిల్ల వాళ్ళ నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అన్నా వినకుండా ఇల్లును కూలగొట్టారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జీవో 58,59 కింద ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశాం. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చాక 58, 59 జీవో బంద్ పెట్టిండు. పైసలు కట్టినోళ్లకు కూడా పట్టాలు ఇవ్వడం లేదు. రైతుబంధు కేసీఆర్ 10,000 ఇస్తుండు నేనొస్తే 15,000 ఇస్తానన్నాడు. కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్టు అయింది. 15,000 కాదు కదా కేసీఆర్ ఇచ్చిన 10,000కి కూడా ఇప్పుడు దిక్కులేదు. వానకాలం రైతుబంధు, యాసంగి రైతుబంధు 40 పైసలు మందమేసి 60 పైసలు ఎగ్గొట్టిండు. వానకాలం రైతుబంధు 9,000 కోట్లు, యాసంగి రైతుబంధు 5,000 కోట్లు.. రెండు కలిపితే 14 వేల కోట్లను రైతుబంధు కింద రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
రుణమాఫీ అసలు ఇయ్యాల్సింది 49 వేల కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31 వేల కోట్లు, ఇచ్చింది 15, 16 వేల కోట్లు కూడా లేదు.
వానకాలం యాసంగికి ఎగ్గొట్టిన రైతుబంధు డబ్బులు 14,000 కోట్లు రుణమాఫీకి పెట్టిండు. 50 శాతం రుణమాఫీ కూడా కాలేదు, రైతుబంధు రాలే, 4000 పెన్షన్ రాలే, అక్కచెల్లెళ్లకు మహాలక్ష్మి పెన్షన్ రాలే. కేసీఆర్ ఎన్నికల హామీ ఇవ్వకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు తులం బంగారం పూసే లేదు అని హరీశ్‌రావు విమర్శించారు.