Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. 60 పేజీలతో కూడిన రిపోర్టు కాకుండా అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హరీశ్‌రావు తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్టు మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయటపెట్టారు. దాని మీద వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించడం జరుగుతుంది. గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రైతులకు సరిపడా యూరియూ లేదు. హాస్టల్ పిల్లలకు సరైన ఆహారం లేక ఆస్పత్రి పాలవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఈరకమైన పరిస్థితులు ఉన్నాయి. డబ్బులు దంచుకునేందుకు కమీషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించేందుకు రాజకీయ కమీషన్లకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగులకు అనుమతల కోసం కమీషన్లు. రాష్ట్రమంతా కమీషన్ల మాయంగా మారిందని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీ అందరికీ తెలుసు. ఇదే గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు ఉంది. అది మూడుసార్లు కుప్పకూలింది అయినా ఎన్డీఎస్ఏ పోదు, రిపోర్టు ఇవ్వదు. కానీ మేడిగడ్డ మీద మాత్రం పిలవక ముందే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే ఎన్డీఎస్ఏ వస్తది.. రిపోర్టు ఇస్తది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, ఎంపీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ రజతోత్సవం ముందు ఒక రిపోర్టు ఇస్తారు బీజేపోళ్లు. ఇది బీజేపీ నీతి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇక రేపోమాపో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి.. ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మీద కాళేశ్వరం కమీషన్ రిపోర్టు బయటపెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కేసీఆర్, హరీశ్‌రావును పిలవాల్సిన అవసరం లేదని, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చినట్లు మీరే రాశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచారు. కేసీఆర్, హరీశ్‌రావును పిలిచినట్టు మీడియాలో లీకులు. కానీ మాకు నోటీసులు రాలేదు. ఇదంత కుట్ర అని అర్థమైందని హరీశ్‌రావు అన్నారు.
నిన్న రాష్ట్ర ప్రభుత్వం 60 పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేశారు. ఆ రిపోర్టు చూస్తుంటే అవాస్తవాలు, అబద్దాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడిన రిపోర్టు అది. అది పూర్తి రిపోర్టా..? కమీషన్లో ఉన్న విషయాలే చెప్పారా..? ప్రభుత్వం ఏమైనా వండి వార్చిందా..? పూర్తి రిపోర్టు బయటకు వస్తే డెఫినెట్‌గా బీఆర్ఎస్ గట్టిగా స్పందిస్తుంది. అసెంబ్లీలో పెడుతామంటున్నారు. అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెటండి.. చీల్చి చెండాడుతాం. నిజాలు ప్రజల ముందు పెడుతాం. వాస్తవాలను నిగ్గు లేత్చుతాం. శాసనసపభా వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
నచ్చిన పేరాలు లీకులు.. నచ్చని నాయకులను బాధ్యులను చేసినట్టు నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడుతుంది. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టు రిపోర్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు టీఏసీ టెక్నికల్ అనుమతులు ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజినీర్లను తప్పుబట్టినట్టు. ఒక వైపూ చూసి ఒక వైపు నిలబడి ఇచ్చినట్టు రిపోర్టు ఉంది. 655 పేజీల రిపోర్టు బయటపెడితే వాస్తవం తెలుస్తుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.