Harish Rao | హైదరాబాద్ : అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పద్మారావు గౌడ్ ఇవాళ సాయంత్రం కలిసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ లాబీలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై రేవంత్ రెడ్డిని కలిశామని తెలిపారు.
సీతాఫల్మండిలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశాం.
సీతాఫల్మండిలో హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోటా ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ హయంలో 32 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయి. ఎస్డీఎఫ్ నిధులు విడుదల చెయ్యమని అడిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పద్మారావు గౌడ్ నన్ను తీసుకొని వెళ్లారు. ఈ విషయంపై వారికి రిప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది అని హరీశ్‌రావు తెలిపారు.
బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా భట్టి బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనలేదు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. అయినా ఏమీ అనకుండా బడేభాయ్తో ఉన్న బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీతోనైనా, అటు కాంగ్రెస్‌తో నైనా సమానమైన దూరంలో ఉంటది. రెండు పార్టీలతోనూ పోరాటం చేస్తది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవాళ బీజేపీ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. కానీ, రేవంత్ రెడ్డి బీజేపీని పల్లెత్తు మాట అంటలేడు. బీజేపీ మహేశ్వర్ రెడ్డి కూడా బడ్జెట్ చర్చలో కాంగ్రెస్ మీద మాట్లాడిన దానికంటే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ మాట్లాడిండు. బీజేపీ – కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. సరే, ఎవరెంత బురద చల్లినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. బడ్జెట్ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నేను మాట్లాడినంత గట్టిగా మరెవరూ మాట్లాడలేదు. నా ప్రసంగం – మహేశ్వర్ రెడ్డి ప్రసంగం చూశారు కదా. మేం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై బట్టలిప్పే ప్రయత్నం చేసినం. బీజేపీ మహేశ్వర్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసిండు అని హరీశ్‌రావు తెలిపారు.