భూమ్మీద తిరిగితే ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి అడుగతారని భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నరు.. మహారాష్ట్రకు పోయి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేశామని, వడ్లకు బోనస్ ఇస్తున్నామని చెప్పి అక్కడి ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నరు.
Harish Rao | మర్రిగూడ, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, వడ్ల కొనుగోళ్లపై కేర్లెస్గా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో హరీశ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను తెలుసుకున్నారు. ఐకేపీ సిబ్బంది, వ్యవసాయశాఖ ఏఈవో ద్వారా కొనుగోళ్లు, డబ్బుల చెల్లింపులపై సమాచారం అడిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై నిప్పులుచెరిగారు. ఈ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు. ‘భూమ్మీద తిరిగితే ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి అడుగతారని భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నరు.. మహారాష్ట్రకు పోయి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేశామని, వడ్లకు బోనస్ ఇస్తున్నామని చెప్పి అక్కడి ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నరు’ అని నిప్పులుచెరిగారు.
రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, సన్నాలను కూడా ప్రభుత్వం కొన్న పాపాన పోవడం లేదని, బోనస్ బోగస్సే అయ్యిందని విమర్శలు గుప్పించారు. నిరుడు నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, ఈ సారి కృష్ణానదిలో నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో ధాన్యం పండిందని తెలిపారు. ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదని చెప్పారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, గన్నీబ్యాగులు అందించక రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్వింటా రూ.1800కే రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎంతకో అంతకు తెగనమ్ముకుంటునానరని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సకాలంలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని హరీశ్‌రావు చెప్పారు. తేమశాతం సాకు చూపుతూ కొనుగోళ్లు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇదే అదనుగా పక్క రాష్ర్టాల దళారులు పాగా వేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కొర్రీలు పెడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించుకునేలా చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం ప్రకటించినా 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. ఎక్కడ చూసినా రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రైతులకు దుఃఖమే మిగిలిందని హరీశ్ వాపోయారు. రైతులకు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, పెట్టుబడి పైసలివ్వలేదని, సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కరోనా కష్టకాలంలోనూ రూ.72వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు. కొనుగోళ్లలోనే కాకుండా మద్దతు ధర అందించడంలోనూ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ యాసంగి పంటకైనా రైతుభరోసా ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలని రేవంత్‌రెడ్డి తాపత్రయపడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. తక్కువ మందు అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారని, 25 మంది సీఐలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. మరి వడ్లు కొనకపోతే మిల్లర్లను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల్లో తులం బంగారం, నెలకు రూ.2500 వాగ్దానాలకు ఎగనామం పెట్టారని విమర్శించారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి మహిళల మెడల్లో పుస్తెల తాళ్లు తెంపేందుకు రేవంత్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పరిశీలనలో హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగదీశ్ తదితరులున్నారు.