Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న కరెంట్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కడిగి పారేశారు. భట్టి విక్రమార్క, నేను ఇద్దరం కలిసి అసెంబ్లీ ముందట ఉన్న గన్‌పార్క్ వద్దకు వెళ్దాం.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలు లేకుండా మంచిగా ఉన్నదా? ఇప్పుడు మంచిగా ఉందా అని ప్రజలను అడుగుదాం.. దీని సిద్ధమా అని హరీశ్‌రావు శాసనసభలోనే సవాల్ విసిరారు. హరీశ్‌రావు సవాల్‌పై అధికారం పక్షం స్పందించకుండా రేవంత్ సర్కార్ తోక ముడిచింది. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా హరీశ్‌రావు ప్రభుత్వాన్ని పలు అంశాల పట్ల నిలదీశారు.
ఏ ప్రభుత్వమైతే ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో, ఆ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యాలను బయటపెట్టుకుంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బడ్జెట్ ప్రసంగమంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసమే తయారు చేసినట్లుంది. రాజకీయ కరపత్రం లాగా ఉంది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత గానీ, దార్శనికత గానీ ఏమాత్రం లేదు. ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా, హ్యుమిలియేషన్ ఆఫ్ అపోజిషన్మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతరు. మీరు చేసింది ఏందో, చెయ్యబోయేదిఏందో గది చెప్పరాదు. 8 నెలలు గడుస్తున్నయి అధ్యక్షా. మన రాష్ట్రంలో దశ, దిశ లేని పాలన నడుస్తున్నది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్త రాజకీయ రొద, కాయగొరుకుడు మాటలు. ఏమి లేని విస్తరాకుకుఎగురుడు ఎక్కువ అనే సామెత గుర్తుకువస్తుంది. విజన్లేదు, విషయం లేదు, ఇప్పటివరకు సాధించిన ఒక విజయం లేదు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధ హస్తులని ఈ బడ్జెట్ నిరూపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెందింది అని రాశారు. మరోవైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,47,229 అని పేర్కొన్నారు. ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షనా? ఇంత కన్ఫ్యూజనా? ఇంత కుట్రనా? 2014 లో తలసరి ఆదాయంలో తెలంగాణ 11వ స్థానంలో ఉండేది. గోవా, సిక్కిం మినహా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపాం. తలసరి ఆదాయం ఇంత గొప్పగా మా పాలనలో పెరిగిందా? ఎనిమిది నెలల మీ పాలనలో పెరిగిందా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తరా భట్టి గారూ? అని హరీశ్‌రావు నిలదీశారు.
నాలుగున్నర లక్షలు లేని జీఎస్డీపీని పద్నాలుగున్నర లక్షల పైకి తీసకపోయింది బీఆర్ఎస్ పాలనా? మీ కాంగ్రెస్ పాలనా? 2014లో దేశ జీడీపిలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1 శాతం. పదేళ్లలో 5 శాతానికి పోయింది. ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా? ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా? 2013-14లో కోటి 7లక్షలున్న పంటల ఉత్పత్తిని, 4కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలనా? మీ పరిపాలనా? మేము వ్యవసాయానికి ఏం చెయ్యకుండనే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా? చెయ్యి పార్టీ వాళ్లు చెవిలో పుష్పగుచ్చాలు పెడుతరని భట్టి ప్రసంగం విన్నంక అర్థమైంది. రెండేండ్ల వ్యవధిలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకుపోయామని హరీశ్‌రావు తెలిపారు.
ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తిప్పితిప్పికొడితే 7778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒకే ఒక్క దశాబ్దంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,483 మెగవాట్లకు పెరిగింది. మీరు చేసినదానికి మూడింతలు చేసినం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుండేదో తెలుసా కేవలం 1196 యూనిట్లు. అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి పేర్కొన్న బీఆర్ఎస్ పరిపాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది. గిదంత కాదు భట్టి గారు. గింత చర్చ, ఇన్ని సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఈరోజు పరిస్థితి గురించే మాట్లాడుకుందాం. స్పీకర్‌ను రిక్వెస్ట్ చేసి టీ బ్రేక్ తీసుకొని మీరు, నేను ఇదే అసెంబ్లీ ముందట ఉన్న గన్ పార్క్ చౌరస్తల ఓ పది నిమిషాలు నిలవడి వచ్చి పోయెటోళ్లను అడుగుదాం. కరెంట్ సరఫరా బీఆర్ఎస్ పరిపాలనల మంచిగున్నదా? కాంగ్రెస్ పరిపాలనల మంచిగున్నదా అని? పది నిమిషాలల్ల మొత్తం ఖుల్లంఖుల్ల అయితది. మాట్లాడితే అర్థం పరమార్థం ఉండాలె కదా అధ్యక్షా. కరెంట్ గురించి రేవంత్ రెడ్డి అప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉండి ఏమన్నారు. తన తండ్రి చనిపోతే ఊళ్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంట్ లేక నీళ్లు లేక నెత్తిమీద నీళ్లు చల్లుకున్నా అని నాడు రేవంత్ అన్నరు. అలా ఉంది నాటి కరెంట్ పరిస్థితి. సీఎం, మంత్రుల మీటింగ్ లకు పోలీసులతో పాటు, కరెంటు వాళ్లు జనరేటర్లు పెట్టుకొని రెడీగా ఉంటున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నేను, భట్టి విక్రమార్క ఇద్దరం అసెంబ్లీ ముందు రోడ్డు మీదికి కలిసి వెళ్దాం.
బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలు లేకుండా మంచిగా ఉన్నదా? ఇప్పుడు మంచిగా ఉందా అని ప్రజలను అడుగుదాం – హారిష్ రావు pic.twitter.com/WB2dHW9TPH
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి.. కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో : హరీశ్‌రావు
Harish Rao | బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు..! : హరీశ్‌రావు