Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసం, పదోన్నతుల కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఒకరిద్దరు అధికారులు రేవంత్ రెడ్డిని ఖుషీ చేయడానికి, పదోన్నతుల కోసం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అధికారులు చేసే అతికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఏపీలో అధికారులకు ఏ గతి పట్టిందో మీకూ అదేగతి పడుతుందని అన్నారు.
అధికారులు రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనులు చేయవద్దని, చట్ట ప్రకారం నడుచుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు. తాము గమనిస్తున్నామని, రికార్డు చేస్తున్నామని చెప్పారు. ఏ పోలీస్ అధికారి ఏం చేస్తున్నడో లెక్కలు రాస్తున్నామని తెలిపారు. అధికారుల అరాచకాలు, సెటిల్ మెంట్స్ అన్నీ తీస్తామని, వారు రిటైర్డ్ అయినా, విదేశాల్లో ఉన్నా, సెంట్రల్ సర్వీసెస్‌కు డిప్యూటేషన్ల మీద వెళ్ళినా తీసుకొస్తామని చెప్పారు.
మీరు మీ పరిమితుల్లో ఉండాలని, ఏ కలుగులో దాక్కున్నా బయటకు తెస్తామని అధికారులను ఉద్దేశించి హరీశ్‌రావు వార్నింగ్ ఇచ్చారు. ‘ఖాకీ బుక్ ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి కాదా..? సీఎం రేవంత్ రెడ్డికి సేవ చేయడానికా..?’ అని ప్రశ్నించారు. ‘మీ ఖాకీ బుక్ ఏం చేస్తుంది శివధర్ రెడ్డీ?’ అని నిలదీశారు. ‘పోలీసుల సమస్యలపై దృష్టి సారించు శివధర్ రెడ్డీ’ అని సూచించారు. ‘నాలుగు సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. నువ్వేం డీజీపీవి..?’ అని ఎద్దేవా చేశారు.
ఎంతసేపు ఈయనకు నోటీసులు, ఆయనకు నోటీసులు పంపడమే నీ పనా..? అని డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ ఫుట్‌బాల్ ఆడుతుంటే అక్కడ నిలబడటమే నీ పనా..? అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఒక్క మాదాపూర్ బెటాలియన్‌ను మాత్రమే ఎందుకు ఇచ్చావు..? అని నిలదీశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో.. నీ ఖాకీ బుక్‌లో రూల్స్ అంతే నిజం శివధర్ రెడ్డీ అని హరీష్ రావు చిట్ చాట్‌లో విమర్శించారు.