Harish Rao | హైదరాబాద్ : చెట్ల నరికివేత విషయంలో పేద రైతుకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటదా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. తాజ్‌కృష్ణ హోటల్లో సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూములపై ఫిర్యాదును ఇచ్చిన అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఉల్లంఘించి పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడిన తీరును సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ కమిటీకి వివరించాం. ఈ రాష్ట్రంలో అడవుల విధ్వంసం, వన్య ప్రాణుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో పూర్తిగా ఆధారాలతో సహా కమిటీకి అందజేశాం. కమిటీ కొన్ని ప్రశ్నలు వేస్తే వాటికి కూడా వివరంగా సమాధానం ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు.
ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టునో, వేప చెట్టును నరికేస్తే ఎమ్మార్వో, ఎస్ఐ వచ్చి కేసులు పెడుతుంటారు. లక్షల రూపాయాల పెనాల్టీ విధిస్తుంటారు. కంచ గచ్చిబౌలిలో వందలాది ఎకరాల్లో వేలాది చెట్లు నరుకుతుంటే రెవెన్యూ, ఫారెస్టు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది..? ఎందుకు కళ్లు మూసుకున్నారు. పేద రైతుకు ఒక న్యాయం.. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటదా..? న్యాయం అనేది సీఎం అయినా రైతు అయినా సమానంగా ఉండాలి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు నగరంలో ఎక్కడైనా ఇల్లు కట్టాలంటే.. వాల్టా చట్ట ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 50, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 100 చలాన్ కట్టి.. ఇల్లు కట్టాలని చెట్లు నరికేస్తున్నానని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తు పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు రూ. 450 డిపాజిట్ చేయమని చెబుతుంది. ఒక చెట్టు కొడితే రెండు చెట్లు పెంచాలని సూచిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తు పెట్టలేదు.. అటవీశాఖ అనుమతి తీసుకోలేదు. అటవీ భూముల్ల్లోనే కాదు.. సొంత పట్టా భూమి, ఇంటి నిర్మాణంలోనూ చెట్లు కొడితే అనుమతి తీసుకోవాల్సిందేనని చట్టం చెబుతుంది. లక్షల రూపాయాలు పెనాల్టీ వేస్తుంటారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేలాది చెట్లను నరికేస్తుంది. చెట్లను నరికేందుకు టీజీఐఐసీ రక్షణ కావాలంటూ పోలీసులకు దరఖాస్తు పెట్టారు. న్యాయబద్దమా.. చట్టానికి లోబడి ఉందా..? లేదా..? అని పోలీసులు విచారణ చేయాలి. ఆ దరఖాస్తే నేరపూరితం.. దీనికి ఫారెస్ట్ అనుమతి ఉందా..? వాల్టా చట్టానికి లోబడి ఉందా..? వైల్డ్ లైఫ్ యాక్ట్‌కు లోబడి ఉందా..? అని పోలీసులు పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. కానీ ఇవేమీ చేయకుండా పోలీసుల రక్షణలో 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోశారు అని హరీశ్‌రావు తెలిపారు.