Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏ రంగు పులిమినా ఫర్వాలేదు.. చలికాలం వచ్చింది రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు రగ్గులు కూడా లేవట వాటి సంగతి చూడు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
కేసీఆర్ హయాంలో 1023 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు అయ్యాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. ప్రతి విద్యార్ధిపై సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలు కేసీఆర్ వెచ్చించారు. కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యున్నత సంస్థల్లో అడ్మిషన్లు పొందారు. డాక్టర్లు, ఇంజినీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ఎవరెస్టుతో పాటు ప్రపంచ పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్వత శిఖరాలను అధిరోహించారు. కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఎవరెస్టు స్థాయికి పెంచితే.. రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎలుకలు విద్యార్థులను కరిచే స్థాయికి తీసుకుపోయారని హరీశ్‌రావు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు చేశారు. వాటిని కట్టేదాకా ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను గాలికి వదిలేయడం మీ విధానమా? ప్రభుత్వం ప్రతి విద్యార్ధిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడిగా ఈ ప్రభుత్వం భావించాలి. గురుకులాలను నడపడం గురుతర భాద్యతగా భావించాలే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించొద్దు. గురుకులాలను సమీక్షించేందుకు గతంలో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేది. ఇప్పుడు అలాంటి కమాండ్ సిస్టం లేదు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌కు ఓ హెల్త్ సూపర్ వైజర్ ఉండాలి. విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటులో లేవని హరీశ్‌రావు పేర్కొన్నారు.
విద్యార్థులు పాములు, ఎలుకల కాట్ల బారిన పడుతున్నారు. వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం మంచాలు కూడా లేవు. కింద పడుకోవడం వల్ల పాము కాట్ల బారిన పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రెసిడెన్షియల్ స్కూళ్లపై సదభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను మూసివేసే కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోంది. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్లకు ఉన్న పేరును పాడు చేయొద్దు అని హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Errabelli | బోనస్ దేవుడెరుగు.. అసలు ధాన్యమే కొనడం లేదు : మాజీ మంత్రి ఎర్రబెల్లి