Harish Rao | హైదరాబాద్ : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఫ్రిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ. 775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా?
లేదా అటకెక్కించారా అనే అనుమానం కలుగుతుంది. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు
అని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు.. మార్చి 31వ తేదీ లోగా మొత్తం చెల్లిస్తామని చెప్పి మాట తప్పారు. మొత్తంగా రైతు బంధు పథకాన్ని ప్రశ్నార్థకం చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ హామీ విషయంలో మేము వెంటబడితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారు. సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురుపోసుకున్నారు. ఇప్పుడు రైతు కుటుంబాలకు ధీమా ఇచ్చే రైతు బీమా పథకాన్ని లేకుండా చేస్తున్నారు. ఇంతకంటే అమానుషం ఏమైనా ఉంటదా? ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమే. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
వివిధ కారణాలతో గడిచిన మూడు నెలల్లో సుమారు వందకు పైగా రైతులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలకు రైతు బీమా సాయం అందకుండా పోయింది. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయి, మరోవైపు రైతు బీమా అందక ఆ కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 5 లక్షలు చెల్లించి, ఎల్ఐసీకి పెండింగ్‌లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.