Harish Rao | హైదరాబాద్ : నాడు ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీశ్‌రావు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. అధికార పక్షంపై నిప్పులు చెరుగుతూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఒకటా రెండా.. ఇప్పటికే కొన్ని వందల సమస్యలపై రేవంత్ సర్కార్‌ను హరీశ్‌రావు చీల్చిచెండారు. గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. రైతులకు అండగా నిలబడుతూ.. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.
తాజాగా యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయాన్ని హరీశ్‌రావు ముట్టడించారు. బీఆర్కే భవన్ వైపు నుంచి సచివాలయం దిశగా హరీశ్‌రావు పరుగెత్తుకుంటూ వచ్చి అన్నదాతల తరపున నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇనుప కంచెలను, పోలీసు ఆంక్షలను హరీశ్‌రావు లెక్కచేయలేదు. సచివాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని హరీశ్‌రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం.. ఇనుప కంచెలను లెక్క చేయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. యూరియా రైతుల హక్కు… అది అందకుండా చేయడం కాంగ్రెస్, బీజేపీల తప్పు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవాళ ఉదయం గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ నేతలు వినూత్న పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి యూరియా కొరత తీర్చాలంటూ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం సచివాలయాన్ని ముట్టడించి రైతుల తరపున నిరసన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను మళ్లీ అరెస్టు చేశారు.
రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..
యూరియా రైతుల హక్కు…
అది అందకుండా చేయడం
కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025