Harish Rao | హైదరాబాద్ : దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఒకరు ఏమో కాళేశ్వరం తిట్టుడు మరొకరు కాళేశ్వరం మొక్కుడు.. రూ. 7000 కోట్లతో నువ్వు ప్రారంభించబోతున్న ఈ పథకం కాళేశ్వరం నీళ్లతో కాదా..? మల్లన్న సాగర్ కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంట.. మల్లన్నసాగర్ 2008, 2009లో రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని అంటున్నాడు.. అనంతగిరి 1.70టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎంసీలే.. ఐదు టీఎంసీలు మాత్రమే ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్‌లో ప్రతిపాదించారు.. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు.. కేంద్ర ప్రభుత్వానికి 2008లో డీపీఆర్ పంపితే 2012లో డీపీఆర్‌ను తిప్పి పంపింది సీడబ్ల్యుసీ. ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో 16 ఎకరాలకు నీళ్లు పారవు. రిజర్వాయర్లకు కెపాసిటీ పెంచుకోండి అని డీపీఆర్‌ను రిజెక్ట్ చేసింది సీడబ్ల్యూసీ. రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకునేవాడు అని హరీశ్‌రావు అన్నారు.
సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ 50 టీఎంసీల మల్లన్న సాగర్ నిర్మించారు. ఇదే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ కట్టవద్దని 48 గంటలకు దీక్ష చేసిండు.. 2016లో మల్లన్న సాగర్ కట్టాలంటే ప్రజలందరూ రెఫరండం తీసుకుని కట్టాలని దీక్ష చేసిండు అప్పుడు రేవంత్ రెడ్డి.. మల్లన్న సాగర్ కడితే ఆ ప్రాజెక్టు కింద ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాలు పండే భూమిని ఇవ్వాలి అని అన్నాడు.. మూసీలో దాదాపు 300 ఇళ్లు ఖాళీ చేయించిండు రేవంత్ రెడ్డి.. అడ్డుకునే తెలివి నీది రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్‌కు అడ్డం పడ్డది నువ్వు.. మల్లన్న సాగర్‌లో ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి 99 శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు ఇష్టపూర్వకంగా ఇచ్చారు.. మూసీలో మొన్న 300 ఇళ్లను కూలగొట్టిన రేవంత్ రెడ్డి.. చివరికి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్‌లు మాత్రమే వాళ్ళకి ఇచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.. మల్లన్న సాగర్‌లో భూమి కోల్పోయిన వారికి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల్లో సొంత ఇంటిని కట్టించినం రేవంత్ రెడ్డి మేము.. రెండున్నర లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినం. 18 దాటిన వారికి కూడా నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలో ఖాళీ చేయించిన వారికి రూ. 25 వేల చెక్కు ఇచ్చిండు.. ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినయ్.. కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్ నిర్వాసితులకు కట్టించాడు.. మూసి నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఒక దీక్షతో మల్లన్న సాగర్ కట్టిండు. మల్లన్న సాగర్ ఈరోజు హైదరాబాద్‌కి, రైతులకు ఒక వరంగా మారింది.. నోరు ఉంది కదా అని గావుపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు.. నిజాలు అబద్ధాలు కావు.. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదన్న విషయాన్ని అబద్దంగా మార్చే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఒక చుక్క మంచినీళ్లు తేలేదు అని మరో అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి.. మంచినీటి కోసం హైదరాబాద్‌లో నీటి యుద్ధాలు జరిగేది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ. 7,000 కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశాం. మీరు ఎల్లంపల్లి నుండి హైదరాబాద్‌కు తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై ఏడేళ్లయినా పూర్తి కాలేదు.. ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు మంచినీళ్లు తెచ్చే లైన్లో రైల్వే, మిలిటరీ ల్యాండ్ల పర్మిషన్లు పెండింగ్ ఉంటే రెండు సంవత్సరాల్లో రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను ఒప్పించి మెప్పించి హైదరాబాద్‌కు వాటర్ సప్లై స్కీమ్‌ను పూర్తి చేశామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కృష్ణ ఫేజ్ 4 పనులను కూడా పూర్తి చేసి కృష్ణ నీళ్లను కూడా హైదరాబాద్ తెచ్చింది కేసీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 56 రిజర్వాయర్లు, 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినం.. ఓఆర్ఆర్ ఫేస్ వన్, ఫేస్ టూలో 2000 కోట్లు ఖర్చు చేసి ఓహెచ్ఎస్ఆర్ పైపులైన్లు వేసాము. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలని.. భవిష్యత్తులో వందేళ్ల కోసం నాగార్జునసాగర్ నుండి 60 టీఎంసీల నీళ్లు తీసుకోవాలని సుంకిశాలను ప్రారంభించినం. మీరు ప్రాణహిత చేవెళ్ల రంగారెడ్డి జిల్లాలో పెట్టింది 1,50,000 ఎకరాలకే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఆరు లక్షల 50వేల ఎకరాలకు మేము ప్రతిపాదించాము.. వికారాబాద్, పరిగి, తాండూర్.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో లేవు.. కృష్ణా నదిలో నీటి వాటా కోసం రంగారెడ్డి కృష్ణా పరివాహక ప్రాంతంలో వస్తుంది.. సప్లిమెంటేషన్ చూపిస్తే ట్రిబ్యునల్ ముందు మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుందని. కృష్ణా నదిలో మాకు వాటా ఉందని గ్రావిటీ ద్వారా ఉద్దండపూర్ రిజర్వాయర్ నుండి 6.5లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన చేశాం. 2014లో అసెంబ్లీలో బిల్లుపై చర్చలో రేవంత్ రెడ్డి ఏమన్నరో చూద్దాం.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 5000 కోట్లు ఖర్చు చేసి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు.. నిన్నేమో 2008-09లో మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని మరో అబద్ధం చెపుతున్నాడని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
సెక్రటేరియట్‌కి కూడా పునాదిరాళ్లు నేనే మోసా అంటాడేమో. అమరవీరుల స్థూపానికి కూడా నేనే మేస్త్రి అని అంటాడు.. జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లను కూడా కాంగ్రెస్ కట్టిందని అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిందే లేదు.. ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా మా తాత కట్టిండు అని చెప్పుకుంటాడు.. అధికార మదంతోనో, ధన బలంతోనో తిమ్మినిబమ్మిని చేద్దామని చూస్తే జనం సహించరు తిప్పికొడతారు. జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. మంచి పనులు చేస్తే మేము సహకరిస్తాం. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనుక మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో నిర్మించిండు కాబట్టే నువ్వు హైదరాబాద్‌కు నీళ్లు తేగలుగుతున్నావ్. 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండంగా కూడా మేడిగడ్డకు ఎందుకు పోయారని ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నారు.. ఈరోజు వారే నిజం ఒప్పుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉంది అని అంటున్నారు.. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి అన్నారు కదా తెచ్చి చూపించండి.. 148 మీటర్ల వద్ద బ్యారేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎక్కువ తీసుకోలేము అని హరీశ్‌రావు తెలిపారు.