Harish Rao | హైదరాబాద్ : మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టుంది. నిండా మునిగినోనికి నాకేముంది అన్నట్టు అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో మునిగిపోయాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అబద్ధాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. గోబెల్స్‌ని మించిపోయిండు రేవంత్ రెడ్డి. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టామని అంటాడు. రేవంత్ కత్తెర జేబులో పెట్టుకోని తిరుగుతున్నాడు. ఏడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవి. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామంటున్నారు. మీలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాలని అనుకోలేదు. నీలాగా దిక్కుమాలిన దివాళాకోరు రాజకీయాలకు కేసీఆర్ పాల్పడలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదుల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కాలేదు. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదు. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును 2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
మేము నీలాగా చిల్లర రాజకీయాలకు పోలేదు.. నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన కూడా మేము నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నావ్. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టీఎంసీలు పోతాయి. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఆరున్నర టీఎంసీలు. మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిప్ట్కు మూడు టీఎంసీలు. లోకల్లో రామగుండం లిఫ్ట్‌కు ఒక టీఎంసీ వాడుకుంటాం.. దానికి సామర్ధ్యం కంటే ఎక్కువ వాడుతున్నాం ఇప్పటికీ. ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్‌కి ఎలా తెస్తావు రేవంత్ రెడ్డి? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్ రేవంత్ రెడ్డి? ఎందుకు గోబల్స్ ప్రచారం? ముఖ్యమంత్రి కుర్చీకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నావు అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నాయా..? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటర్లు ఆఫ్ చేస్తే మేడారం రిజర్వాయర్‌లో పడతాయి.. లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.. మిడ్ మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్‌కు వస్తాయి. అక్కడనుండి రంగనాయక సాగర్‌కు వస్తాయి.. రంగనాయక సాగర్ నుండి మళ్లీ మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్‌కు వస్తాయి.. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు దాకా కూడా కెనాల్స్ గాని, గ్రావిటీ కెనాల్ కానీ, రిజర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్‌లు గాని అన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ మంచి నీటి కోసం మల్లన్న సాగర్‌లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టిండు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినవంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్‌కి వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు.. అవి కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెన్, 203 కిలోమీటర్ల టన్నెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. ఈ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇది కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన 93 వేల కోట్లలో నిర్మించింది మల్లన్న సాగర్.. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకున్న గౌరవం తగ్గుతుంది రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా తన విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే కేవలం కాగితం ఇచ్చి ఈ ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టన్నెల్సు, సబ్స్టేషన్లు, కెనాల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బటన్ నొక్కి సీతారామ ప్రాజెక్టు మేమే నిర్మించినమని చెప్పుకుంటున్నారు.. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దగ్గర మీ మంత్రులే నీళ్లు విడుదల చేసి నెత్తి మీద చల్లుకుంటున్నది నిజం కాదా..? అని హరీశ్‌రావు నిలదీశారు.