Harish Rao | మసి పూసి మారేడు కాయ చేస్తే నిజాలు దాగవని.. మేడిగడ్డను పడావు పెట్టి నీళ్లను కిందకు వదిలి రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యిందని.. మేడిగడ్డను రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా, ఎల్అండ్టీ రిపేర్ చేయడానికి సిద్దపడినా ఎందుకు మరమ్మతులు చేయడం లేదన్నారు. అప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టారని.. ఇప్పుడు మేడిగడ్డను పండబెడుతున్నరని మండిపడ్డారు. రైతు ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రాకు నీళ్లు తరలించడంపైనే దృష్టి పెట్టారని.. మేడిగడ్డ బ్యారేజీ మీది నుంచి వాహనాలు అనుమతించాలని ఎన్డీఎస్ఏ నీకు చెప్పిందా? అని నిలదీశారు. కూలిందని చెప్పుకుంటూనే ఎందుకు రాకపోకలు అనుమతిస్తున్నారని.. ఏ నిపుణుల కమిటీ చెప్పంది రేవంత్ రెడ్డి? అసెంబ్లీకి నిపుణులను పిలవడం కాదు, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు నిపుణులను పిలుచుకొని ముందు ముందు.. తర్వాత సుద్దులు చెబుదువు గాని అంటూ చురకలంటించారు.
జూరాల జలాశయం నికర నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు మాత్రమేనన్నారు. ఇప్పటికే బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని తదితర పట్టణాల తాగు నీటి అవసరాలు ఉన్నాయన్నారు. అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యమవుతుందా? పాలమూరు బిడ్డను అని చెప్పుకునే నీకు ఆ మాత్రం తెల్వదా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పుకు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నదని.. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని.. అబద్దాలను అందంగా చెప్పే రేవంత్ రెడ్డి.. ఎవర్ని కొరడా దెబ్బలు కొట్టాలె? ద్రోహం చేసింది ఎవరు.. కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు? అని నిలదీశారు. 50 ఏండ్లు తెలంగాణ నీటి హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలె.. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలె అన్నారు.
కృష్ణా నీళ్లను పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు తరలిస్తుంటే హారతులు పట్టిన ఆనాటి కాంగ్రెస్ మంత్రులను కొట్టాలెనన్నారు. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను దారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న నిన్ను కొరడా దెబ్బలు కొట్టాలె రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్లో అధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇరిగేషన్‌పై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదు ప్రశ్నించారు. నీ సవాల్లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజా భవన్‌కు ఆహ్వానించలేదని.. ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్‌కు భంగం కల్పించడమేనని.. దీనిపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందన్నారు.