Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని, ఈ దాడుల కుట్రదారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డినే. చేసిందంతా చేసి ఇవాళ సీఎం శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడానికి కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ ప్రెస్‌నోట్స్ ఇచ్చారు. నిన్న అరికెపూడి గాంధీకి అడిషనల్ డీసీపీని ఎస్కార్ట్‌గా పెట్టి 8 పోలీసు స్టేషన్లు దాటించి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయించారని హరీశ్‌రావు తెలిపారు.
నిన్న లా అండ్ ఆర్డర్ ఏమైంది… నిన్న గాంధీని ఆపొచ్చు కదా..? నిన్న ఆయనను ఆపి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేదా..? మరి ఎనిమిది పోలీసు స్టేషన్లు దాటించి, కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు. మరి నిన్న ఎందుకు యాక్ట్ చేయలేదు. దీనికి కారణం సీఎం, డీజీపీ కాదా..? ఇప్పుడేమో సీఎం, డీజీపీ సన్నాయి నొక్కులు నొక్కతున్నారు. ఎవరి మీద దాడులు చేయాలని రివ్యూలు చేస్తారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
నిన్న రాళ్ల దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి బిర్యానీలు, సమోసాలు తినిపించి, ఆ తర్వాత ఎస్కార్ట్ ఇచ్చి ఇంటింకి పంపించారు. కౌశిక్ రెడ్డి మీద దాడి విషయంపై మేం ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అరెస్టు చేసి 2 గంటలు హైదరాబాద్‌లో తిప్పి అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జంగిల్లో విడిచిపెట్టారు. ఇదేనా పోలీసులు ప్రవర్తించే తీరు.. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ ఉందా..? అని నిలదీశారు హరీశ్‌రావు.
వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్తే.. ఖమ్మంలో రాళ్ల దాడి చేశారు. పది రోజులైనా దానిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.. ఆ గూండాలను అరెస్టు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లగొండ వెళ్తే.. బస్సుల మీద కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. ఈ ఘటనల్లో ఏ ఒక్క విషయంలో కూడా పోలీసులు యాక్ట్ చేయలేదు. అరెస్టులు చేయలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే రెచ్చగొడుతున్నారు. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష. పేగులు తీసి మెడలు వేసుకుంటా.. లాగుల్లోకి తొండలు జొరగడుతా.. అని రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డినే మాట్లాడుతున్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అనుసరిస్తున్నారు. దానం నాగేందర్, అరికెపూడి గాంధీ కూడా అలానే పని చేస్తారు. పదేండ్లు కేసీఆర్ నాయకత్వంలో వీరిద్దరూ రౌడీల్లా ప్రవర్తించలేదు. రేవంత్ భాష, విధానం వల్ల నాయకులు కూడా అలానే తయారవుతున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టండి అని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది..? మొదట నీవు రివ్యూ చేసుకో.. మంత్రులను రివ్యూ చేసుకో. ఇవాళ మమ్మల్ని హౌస్ అరెస్టు చేశారు. అదే నిన్న గాంధీని అరెస్టు చేసి ఉంటే ఇది జరిగేదా..? హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ వైఖరేంటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఈ దాడుల కుట్రంతా రేవంత్ రెడ్డి ఎజెండా.. గాంధీ చేసిన దాడిగా పరిగణించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రకమైన నిర్బంధాలు, అణిచివేతలు చూడలేదు. రేవంత్ పాలలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..