Padi Kaushik Reddy | ఆంధ్రా సెటిలర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. నిన్నటి ప్రెస్మీట్లలో ఎక్కడా కూడా తాను సెటిలర్స్ అనే పదమే వాడలేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడి ఉంటే.. అది తనకు, అరికెపూడి గాంధీకి పర్సనల్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీర్పూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వివరణ ఇచ్చారు.
తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా సెటిలర్స్పై తనకు గౌరవం ఉందని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఏ ఒక్క ఆంధ్రా సెటిలర్ మీద కూడా దాడి చేయలేదని గుర్తుచేశారు. గత పదేళ్లలో వారికి అద్భుతంగా స్వాగతం పలికామని తెలిపారు. ఇవాళ కూడా ఆంధ్రా సెటిలర్స్కు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. వాళ్లు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. మీ కాలికి ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని గతంలో కేసీఆర్ చెప్పారని.. వారి బాటలో నడుస్తున్నామని తెలియజేశారు.
ఆంధ్రా సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారని మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టం చేశారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ వారిని బీఆర్ఎస్ పార్టీతో దూరం చేయాలని చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ తమతో ఆంధ్రా సెటిలర్స్కు ఉన్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని స్పష్టం చేశారు. ఈ చిల్లర రాజకీయాలను సమాజం గమనిస్తుందని తెలిపారు.
ఇవాళ గాంధీ గురించి శేరిలింగంపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయనకు డబ్బా కొట్టేవాళ్లను కాకుండా సామాన్యులను అడిగితే అసలు విషయం తెలుస్తుందని హితవు పలికారు. ఆయన వాడిన భాష, ఆయన చేసే దాడులపై సమాజం మొత్తం కూడా తూతూ అని ఉమ్మేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సోషల్మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అసహ్యించుకునే స్థితికి తెచ్చుకున్నారని అన్నారు.