Padi Kaushik Reddy : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్న అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరో బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరీ ద్వజమెత్తారు. అరెకెపూడీ గాంధీ వ్యవహరించిన తీరును, మాట్లాడిన భాషను ఎండగట్టారు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘ఎమ్మెల్యే అయిన గాంధీ మాట్లాడిన భాష గురించి శేరిలింగంపల్లి ప్రజలు ఆలోచన చేయాలె. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలె. గాంధీనే స్వయంగా తాను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెబుతున్నారు. మరి నేను మా ఎమ్మెల్యే ఇంటికెళ్లి ఆయనను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోతా అన్న. అందులో ఏమన్నా తప్పున్నదా అని అడుగుతున్నా. ఒక బాధ్యతగల ఎమ్మెల్యేలా గాంధీ మాట్లాడలేదనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని కోరుతున్నా’ అన్నారు.
‘నేనుండే విల్లాల్లో నేనొక్కడినే లేను. నాతోపాటు 69 కుటుంబాలు ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు ఆ కమ్యూనిటీలో ఉన్నరు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి దౌర్జన్యం చేయడానికి వచ్చిండ్రు. ఇలా దౌర్జన్యం చేయడానికి ప్రజలు నీకు ఓటు వేసిండ్రా..? రౌడీయిజం చేయడానికి ఓటేసిండ్రా..? గూండాయిజం చేయడానికి ఓటేసిండ్రా..? ఓట్లేసిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా’ అని కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.