Padi Kaushik Reddy | నాకు దూకుడు ఎక్కువ ఉంటే.. దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ గోకుడు బంజేయాలని సూచించారు. సిగ్గు శరం లజ్జ మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఖైరతాబాద్‌లో ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘ కేసీఆర్ నాయకత్వంలో పీఏసీ చైర్మన్‌గా హరీశ్‌రావును పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. హరీశ్‌రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్‌ను నామినేట్ చేశాం. మరి మేం నామినేట్చేసిన తర్వాత గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారు’ అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 13 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎలక్షన్లు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. రూల్ నంబర్ 250 ప్రకారం స్పీకర్‌కు కూడా ఆ అధికారం లేదని అన్నారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అరికెపూడి గాంధీకి ఎందుకు భయం అవుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు.
వారిలా దాడులు చేయడం తమకు పెద్ద విషయమేమీ కాదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేయవద్దని.. వాళ్లు చేసిన తప్పులు మనం చేయవద్దని కేసీఆర్ అనడంతో సమన్వయం పాటిస్తున్నామని చెప్పారు. తాము దాడులకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు కాదని.. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హితవు పలికారు.