Harish Rao | నాగర్‌కర్నూల్ : ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ రాలేదు.. ఎందుకింత బాధ్యతారాహిత్యం..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. బృందాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం విలఫమైంది. టన్నెల్లోకి వెళ్లేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు. సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుందని ఇన్ని రోజులు రాలేదు. ప్రజాప్రతినిధులం మంత్రిని కలవకూడదా..? ప్రమాదానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదా..? ఇదెక్కడి ప్రజా పాలన..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు.
ఆరు రోజుల తర్వాత తీసింది కేవలం తట్టెడు మట్టి మాత్రమే. 8 మంది ప్రాణాలు కాపాడటం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..? కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయినయ్. ప్రమాద ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకు సరైన డైరెక్షన్ లేదు. మంత్రులు పొద్దున వస్తున్నారు.. సాయంత్రం పోతున్నారు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏమైనా టూరిస్ట్ ప్లేసా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఇక ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలు తరలించుకుపోతోంది. మన నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం ఆపడం లేదు. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదు. కృష్ణా జలాలపై మేము నిలదీసిన తర్వాత కేఆర్ఎంబీ వద్దకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.