Harish Rao | హైదరాబాద్ : ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఈ 23 నెలల పాలనలో ఏం సాధించారు అని విజయోత్సవాలు జరుపుతారు అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలు నడుపుతారంటా.. ఎందుకు నాయన తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకా? కమిషన్ల కోసం క్యాబినెట్లో గల్లాలు పట్టుకొని కొట్టుకున్నందుకా? మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుకా? ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కింది. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుతారా..? నెలకు రూ. 2500 ఇస్తారేమోనని మహిళలు ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయని వర్గం లేదు. రైతుబంధు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుతారా..? గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నందుకు ఉత్సవాలు జరుపుతారా..? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా..? అని హరీశ్‌రావు నిలదీశారు.
పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి.. మేము కాపాడుతాం. మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి కాకీ బుక్‌లో మంత్రులకు రూల్స్ వేరేలా ఉన్నాయా? టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరిస్తుంటే.. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే వారి మీద కేసు లేదు. ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని హరీష్ రావు తెలిపారు.