హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే అది నెరవేరబోతున్నదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు ఊసెత్తడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మైనారిటీకి కూడా స్థానం కల్పించలేదని, నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఈ విధానం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. రాష్ట్రంలో మసీదులు, దర్గాలను కాంగ్రెస్ పాలకులు కూలగొడుతున్నారని, సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో ఒక దర్గాను, రెండు శ్మశానవాటికలను బుల్డోజర్లతో తొలిగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో మత కలహాల్లేవు
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో మత కలహాలు లేవని, కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో మతకలహాల సంఖ్య బాగా పెరిగిందని మహమూద్ అలీ విమర్శించారు. మైనారిటీల ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కనీస చర్యలు కూడా లేవని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టం బిల్లును కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకించిందని, కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎంగా కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా బాధితుల్లో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
బీజేపీ ఎజెండా అమలుచేస్తున్న రేవంత్: దాసోజు శ్రవణ్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. బీజేపీ ఎజెండాను అమలుచేయడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలుచేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి.. పొద్దున సెక్యులరిజం గురించి మాట్లాడుతూ.. రాత్రిళ్లు మాత్రం ఆ సెక్యులరిజాన్ని ఖతం చేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తెలంగాణలో ఎలా అమలుచేస్తారని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోని ముస్లింలను ఖతం చేయాలని సీఎం చూస్తున్నారని, అమీర్ అలీఖాన్ లాంటి నేతల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. మైనారిటీలకు రేవంత్‌రెడ్డి పడిన బాకీ మొత్తాన్ని వివరిస్తూ కాంగ్రెస్ బాకీకార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లిం నేతలు అబిద్స్రూల్, ముజీబ్, అజంఅలీ, అర్షద్ అలీఖాన్, బద్రుద్దీన్, ఖలీం ముఖీబ్చాంద్, నియాజీ తదితరులు పాల్గొన్నారు.