Telangana | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థమవుతున్నది. ఇటీవల నడిరోడ్లపై నరుక్కోవడాలు, మహిళలపై అకృత్యాల కేసులు పెరిగిపోయాయి. నేరాలు భారీగా పెరిగిపోవడంపై శాంతిభద్రతల నిపుణులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుశాఖ లెక్కల ప్రకారమే తీవ్రమైన నేరాల్లో 22.53 శాతం పెరుగుదల కనిపించడం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
గూండాలు, రౌడీషీటర్లు, పాత నేరస్తులు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను నడిరోడ్డుపైనే నరికేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పాతనేరస్థులపై పోలీసుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని రిటైర్డ్ పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. పదేండ్ల పాటు పత్తాలేకుండా పోయిన పాతనేరస్థులు మళ్లీ దందాలు మొదలుపెట్టారని వివిధ కేసులలో బయటపడుతున్నది. సెటిల్మెంట్లు, సుపారీ హత్యలు, పాత పగలతో ప్రత్యర్థులను మట్టుబెట్టడం వంటి నేరాలకు తెగబడుతున్నారని ఇటీవలి పలు ఘటనల్లో స్పష్టమైంది. భూవివాదాల్లో ఘర్షణలు కూడా పెరిగిపోతున్నాయి. కట్టడి చేయాల్సిన పోలీసులు సివిల్ కేసులలో తలదూర్చి, కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2023లో కేసుల్లో 39,371 కేసులలో దోషులకు శిక్ష పడింది. 2024లో చూసుకుంటే 28,477 కేసులలో మాత్రమే శిక్ష పడిందని, ఇది 27.67 శాతం తగ్గుదల అని న్యాయనిపుణులు చెప్తున్నారు. కేసుల దర్యాప్తు, ఆధారాల సేకరణ, పకడ్బందీగా అభియోగపత్రాలు దాఖలులో పోలీసులు అనుసరించే విధానాలను బట్టే దోషులకు శిక్షలు పడతాయని వివరిస్తున్నారు. రాష్ట్రంలో దొంగలు తిష్టవేశారని పలు కేసులలో బయటపడ్డా, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులకు విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రత్యేక వాహనాలు, సాంకేతిక పరికరాలు అందించారు. దీంతో ఆపదలో ఉన్న ప్రజలకు శరవేగంగా సేవలు అందించే వీలు కలిగింది. కానీ ప్రస్తుతం పర్యవేక్షణ లోపం, పాలన వైఫల్యం వల్ల డయల్ 100 స్పందన తగ్గిందని బాధితులు చెప్తున్నారు. 2022లో డయల్ 100 రెస్పాన్స్ టైమ్ 5-6 నిమిషాలు ఉండేది. కానీ 2024లో ఆ సమయం 7 నిమిషాలకు చేరుకోగా ప్రస్తుతం 15 నిమిషాలు పడుతున్నదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కనిపిస్తున్నదని శాంతిభద్రతల నిపుణులు చెప్తున్నారు. సీఎం ఆధ్వర్యంలో హోంశాఖ ఉన్నా పర్యవేక్షణ, సమీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాది 6నెలలుగా తలదాచుకున్నట్టు తేలింది. ఢిల్లీ నుంచి ఎన్ఐఏ అధికారులొచ్చి అతడిని అరెస్టు చేశారు. ఆ దుండగుడు ఆరు నెలల్లో ఏదైనా విధ్వంసానికి పాల్పడి ఉంటే పరిస్థితి ఏంటని రిటైర్డ్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మన పోలీసులు నిఘాలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ పాతబస్తీ, బోడుప్పల్, మెదక్, జైనూర్, భైంసా సహా 9 చోట్ల మత ఘర్షణలు జరిగాయి. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన సంచలనంగా మారింది. మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు పంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భారీగా జనం అక్కడికి చేరి, 3 రోజుల పాటు తిష్ట వేశారు. పరిస్థితి చివరకు రాళ్లదాడి, లాఠీచార్జికి దారితీసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ముందే గుర్తించి, ప్రజలకు నిజాలు తెలియజేయడంలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలో పోలీసులు లాఠీలు, కర్రలతో విరుచుకుపడ్డారు. అభ్యర్థుల ఆందోళనను పోలీసులు ముందుగా అంచనా వేయలేదు. బెటాలియన్ కానిస్టేబుళ్లు, కుటుంబ సభ్యులు సచివాలయాన్ని ముట్టడించారు. హోంగార్డుల ఆందోళనతో పాటు చాలా ఘటనలలో నిఘా విభాగం అంచనా వేయలేకపోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ర్టానికి సమర్థవంతమైన నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు తక్షణం ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ లేకపోవడం, ముఖ్యంగా ప్రత్యేకంగా హోంమంత్రి లేకపోవడంతో తెలంగాణలో నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, దోపిడీలు, నడిరోడ్డుపై కత్తులతో నరుక్కోవడం, కర్రలతో దాడులు చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజూ 4 హత్యలు, ప్రతీ 3 గంటలకొక రేప్, రోజూ 5 కిడ్నాప్‌లు జరుగుతున్నాయంటే ప్రజలకు శాంతి లేదు, భద్రత లేదనే విషయం స్పష్టమవుతున్నది.