20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాట మార్చేసింది. చివరికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఆ జాబితాల్లో పేదలకు చోటివ్వకుండా.. కాంగ్రెస్ కార్యకర్తలకు, అనర్హులకే పెద్దపీట వేయడంతో కేంద్రం ఆ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేల అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక జాబితాల్లో పేర్లు గల్లంతైన వారికైతే లెక్కేలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుతామంటూ అరచేతిలో వైకుంఠం చూపిన హస్తం పార్టీ… పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత మొండిచేయి చూపిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కోతలు, కొర్రీలతో పేదలను వంచిస్తున్నదని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. పేదలకు ఇల్లు పేరుతో ఆశచూపి.. ఇచ్చిన మాటను అటకెక్కించిందని మండిపడుతున్నారు. ఇల్లు మంజూరైనా కాంగ్రెస్ నేతల మాటల్లాగానే కట్టుకునే వరకు గ్యారెంటీ లేకుండా పోయిందని ధ్వజమెత్తుతున్నారు. పథకానికి అరకొర నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సాయం కోసం కేంద్రం వైపు చూస్తుంటే.. మోదీ సర్కారు మాత్రం కనికరించడంలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వెరసి ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని పేదలు వాపోతున్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’తో అనుబంధంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను అమలు చేస్తామని వెల్లడించింది. ఒక్కో ఇంటికి కేంద్రం వాటా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపికచేసిన సుమారు 2 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను ఇటీవల కేంద్రానికి సమర్పించగా, అందులో సుమారు 30,000 దరఖాస్తులను తిరస్కరించింది. కాంగ్రెస్ నేతలు అర్హులను పక్కనపెట్టి.. ఇష్టారాజ్యంగా తమ పార్టీ కార్యకర్తలు, అనర్హులను ఎంపిక చేయడంతోనే కేంద్రం ఈ దరఖాస్తులను తిరస్కరించినట్టు ఆరోపణలున్నాయి. నిరుడు జూలై 31లోగా వివరాలు సమర్పించాలని కేంద్రం కోరినప్పటికీ.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కూడా చేపట్టలేదు. మంజూరైన ఇండ్లలో ఎక్కువ శాతం మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన అనర్హులు ఉండటంతో దరఖాస్తులు తిరస్కారానికి గురైనట్టు అధికారులే చెప్తున్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పాత ఇండ్లు కూలగొట్టుకున్న తర్వాత.. అర్హులు కాదంటూ జాబితాలో పేర్లను గల్లంతు చేస్తున్నారు.. అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మితే పాత ఇల్లు కూడా లేకుండా పోయిందని లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇక పట్టణ ప్రాంతాల విషయానికొస్తే.. పీఎంఏవై-అర్బన్‌లో భాగంగా కేంద్రం తెలంగాణకు 1.13 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలు, ఇండ్లు నిర్మించేందుకు ఉద్దేశించిన ప్రణాళికలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. పట్టణాల్లో జీ+3 పద్ధతిలో ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. హైదరాబాద్, వరంగల్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత వెంటాడుతున్నది. దీంతో ప్రస్తుతం పేదలు ఉంటున్న మురికివాడల్లో నుంచి వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి.. అక్కడే ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని ఇండ్లు ఖాళీ చేయిస్తే ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు వారు ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్న అధికారులను వేధిస్తున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు వారిపై అద్దెల భారం పడుతుందని, అంతేకాకుండా సమయానికి ఇండ్ల నిర్మాణం పూర్తికాకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాము ఎక్కడ ఉంటున్నామో అక్కడే పక్కగా ఒకటి-రెండు గదులు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షల ఇవ్వాలని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఖాళీ చేసేది ప్రసక్తేలేదని స్పష్టంచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, సకాలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టకపోతే కేంద్రం మంజూరు చేసిన ఇండ్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే లబ్ధ్దిదారుల డాటా ఆధారంగా కేంద్రం రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4.5లక్షల ఇండ్లకు కేంద్రం నుంచి రూ.2,000 కోట్ల నిధులు వస్తాయని ఆశిస్తున్నది. కానీ కేంద్రానికి సమర్పించిన జాబితాలో అనర్హులు ఉండటం, పట్టణ ప్రాంతాల్లో స్థలాల సమస్య ఉండటంతో ఇంతవరకు కేంద్రం రూపాయి కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లబ్దిదారులకు కేవలం రూ. 300 కోట్లు విడుదల చేసి, అప్పుడే ఇండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఇండ్లు పూర్తయ్యే దశలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తుంటే, చెప్పిన 20 లక్షల ఇండ్లలో పూర్తవుతున్న ఇళ్లు కేవలం 10 వేలు మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వం చెప్పిన 20 లక్షల ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో అని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో కేవలం 4.5 లక్షల ఇండ్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో మంజూరు చేసిన ఇండ్లు 3.5 లక్షలు కాగా గ్రౌండింగ్ అయినవి 2 లక్షలు… లబ్ధిదారులకు విడుదల చేసిన నిధులు రూ.300 కోట్లు. మంజూరు చేసిన 3.5 లక్షల ఇండ్లలో కనీసం పదోవంతు కూడా పూర్తికాకున్నా… అరకొరగా పూర్తయిన ఇండ్లను ప్రారంభించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తున్నదని విమర్శలు వ్యక్తమతువున్నాయి. సర్కారు సకాలంలో నిధులు విడుదల చేయకపోవంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన నిధులు కూడా ఇంటి నిర్మాణ పనులకు చాలకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్తున్నారు.