హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): ‘ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురి మృతదేహాల జాడేది? కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన చిన్న సమస్యకే ఎన్డీఎస్ఏను పంపించి రాద్ధాంతం చేసిన కేంద్రం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు మృతదేహాలను వెలికితీయడంలోనే కాదు, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలోనూ విఫలమైందని దుయ్యబట్టారు. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఆదివారానికి 200 రోజులు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎక్స్ వేదికగా కేటీఆర్ తప్పుబట్టారు. ఈ పాపపు వ్యవహారంలో రెండు పార్టీలు కూడా భాగస్వాములేనని విమర్శించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి.. బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర బంధానికి నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ బడే భాయ్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ చోటే భాయ్‌ను కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో చితికిపోయిన, ఎస్ఎల్బీసీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఆరుగురు బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి గురైన అన్ని రంగాలను గాడినపెడతామని తెలిపారు. ఎల్‌ఎస్‌బీసీ టన్నెల్ కుప్పకూలడానికి గల కారణాలను రాబడతామని స్పష్టంచేశారు. ఆరుగురు కార్మికుల ప్రాణాలను బలిగొన్న బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామని, ఇది బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న హామీ అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఈవీ పాలసీ భేష్
హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ తెచ్చిన ఈవీ, ఈఎస్ఎస్ విధానం భేష్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ఆ ఈవీ పాలసీ ఫలితంగానే మహబూబ్‌నగర్‌లో అమరరాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు.
గద్వాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌లో అమరరాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్‌ను చూసి యూనిట్ పురోగతిపై హర్షం వ్యక్తంచేశారు. యూనిట్ ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో తెచ్చిన ఈవీ, ఈఎస్ఎస్ పాలసీ ఫలితమిదని వివరించారు. అమరరాజా సీఎండీ జయ గల్లాకు ధన్యవాదాలు తెలియజేశారు.