హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థులపై కాంగ్రెస్ సర్కార్ అమానుష చర్యలకు దిగుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్సిటీ హాస్టల్ గదుల్లో నుంచి విద్యార్థులను పోలీసులు బయటకు లాక్కొచ్చి మరీ లాఠీలతో కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని లాక్కోవాలని కాంగ్రెస్ సర్కారు చూస్తున్నదని విమర్శించారు.
దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, వారిపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపై జరిపిన అమానుష లాఠీచార్జిని మళ్లీ గుర్తుకు తెస్తున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఆ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులేనని, వారికీ ఆ యూనివర్సిటీ గురించి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ బాసుల జేబులు నింపడం కోసమే గల్లీ భూములను కాంగ్రెస్ పాలకులు తెగనమ్ముతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నాటి చంద్రబాబు నాయుడు పాలనకు, నేడు సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఏ మాత్రం తేడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడిందని, వాటిని అమ్మి పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.