హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అగ్రికల్చర్ పోయి గన్‌కల్చర్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేరాలకు చిరునామాగా రాష్ర్టాన్ని మార్చారని దుయ్యబట్టారు. నడిరోడ్డుపై హత్యలు, రోజుకోచోట రేప్‌లు జరుగుతుంటే హోం మంత్రిగా ఉన్న సీఎం ఫుట్‌బాల్ ఆటల్లో బిజీగా గడుపుతున్నారని మండిపడ్డారు. 2023తో పోల్చితే రాష్ట్రంలో నేరాల సంఖ్య 14 శాతం పెరిగిందని లెక్కలు వెల్లడించారు. అలాగే 2025లో 1000 మర్డర్లు జరిగాయని ఆరోపించారు. క్రైమ్ రేటు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సాధారణ నేరాలతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శకులు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం తప్ప, శాంతి భద్రతలు, నేరాలను అదుపులో పెట్టే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. శాంతి భద్రతల కోసం పనిచేయాల్సిన పోలీసులు, ఫోటోగ్రాఫర్లుగా అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. రోజుకు 30 ఫోటోలు, 30 చలాన్లు వేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ శాంతిభద్రతలకు చిరునామాగా ఉండేదని ఎర్రోళ్ల గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తే, ప్రస్తుతం వేధించే పోలీసులను తయారు చేశారని మండిపడ్డారు. సీఎం వద్దే ఉన్న హోం, విద్య, మున్సిపాలిటీ శాఖల పనితీరులో వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. శాంతిభద్రతలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు కే కిశోర్‌గౌడ్, ఇంతియాజ్ అహ్మద్, గోసుల శ్రీనివాసయాదవ్, కురువ విజయ్‌కుమార్, గౌతమ్‌ప్రసాద్, సత్యవతి పాల్గొన్నారు.