హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతారని ఒక ప్రకటనలో హెచ్చరించారు. కాళేశ్వరానికి నిర్వచనమే తెలియని శనేశ్వరులు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వా రానే రాష్ట్రంలో అత్యధిక ధాన్యం పండిందని, తెలంగాణ కరువును తీర్చింది ఈ ప్రాజెక్టేనని స్పష్టం చేశారు.
అరికాలికి, బొడిగుండుకు ముడిపెట్టడం ఎంపీ చామలకు ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని, అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకు కూడా సోయి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూలింది మేడిగడ్డ కాదని, కాంగ్రెస్ నాయకుల మెదళ్లు అని ఆరోపించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను విమర్శించే స్థాయి ఎంపీ చామలకు లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సర్కారుకు కాలం చెల్లిందని, సీఎం మెప్పు కోసం చిల్లర కూతలు కూస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించారు.