హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరపాల్సింది తెలంగాణవాదులే తప్ప తెలంగాణ ద్రోహులు కాదని, ఉత్సావాలు జరిపే పేటెంట్ బీఆర్ఎస్కే ఉందని, ద్రోహుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టనబెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆ ఉద్యమంలో అమరులైనవారి గుర్తుగానే గన్పార్ వద్ద స్థూపం కట్టారని గుర్తుచేశారు. మలిదశ ఉద్యమంలోనూ కాంగ్రెస్ ఎంతో మంది విద్యార్థులను, యువకులను బలితీసుకున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ చరిత్ర అంతా మోసం, దగా అని, తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని శ్రీనివాస్ దుయ్యబట్టారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. నీలం సంజీవరెడ్డి నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు కాంగ్రెస్‌ది ద్రోహాల చరిత్రేనని, ఈ రోజు కాంగ్రెస్ ఉత్సవాలు జరుపడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడని, ఈ ఆరు నెలల్లో సీఎం రేవంత్ ఏనాడూ తెలంగాణ అమరుల స్థూపం వద్దకు వెళ్లలేదని, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు అంటే తెలంగాణవాదులు ఎవరూ హర్షించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ అలసత్వం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆత్మబలిదానం చేసుకున్నవారు తమ లేఖల్లో రాయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం నాడైనా, నేడైనా నిలబడేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తప్పుకోగానే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలని సూచించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కొందరు ఏపీ నేతలు అప్పుడే డిమాండ్లు పెడుతుంటే కాంగ్రెస్ మంత్రులు ఒకరు కూడా ఖండించలేదని, కేసీఆర్ సీఎంగా ఉంటే ఇలాంటి డిమాండ్లు వచ్చేవా? అని ప్రశ్నించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రమాదం లేకపోలేదని అనుమానం వ్యక్తంచేశారు.