హైదరాబాద్ జూలై 13 (నమస్తే తెలంగాణ): నోరు తెరిస్తే చాలు బూతులు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు సంస్కారహీనులని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని, గాంధీభవన్‌ను గలీజు భవన్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు సమస్యలపై అవగాహన లేకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి కుసంస్కారంతో చవకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదో కూడా తెలియదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ నీళ్లను తరలించుకుపోతున్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేయడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమీషన్లు, పథకాలు వర్తింపజేసేందుకు కలెక్షన్లు తీసుకోవడమే కాంగ్రెస్ సర్కారు విధానమని ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు.