హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తేతెలంగాణ): పేదింటి బిడ్డలకు కార్పొరేట్‌స్థాయి విద్యనందించే లక్ష్యంతో నెలకొల్పిన 240 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, పార్టీ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్‌యాదవ్, రాంచంద్రునాయక్, వాల్యానాయక్, కొమ్ముల నరేందర్, కీర్తిలతాగౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రూ. 218 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి నిర్వీర్యం చేసి 34 వేల మంది నిరుపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విరుచుకుపడ్డారు. విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డి తన శాఖను గాలికొదిలి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖపై సమీక్షించేందుకు తీరిక దొరకని ముఖ్యమంత్రి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారని చురకలంటించారు. అన్నివర్గాల పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించలేని దుస్థితిలో ఉన్నదని ధ్వజమెత్తారు. ఈ సర్కారు తీరు చూస్తుంటే విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదించిన అంశాలను పక్కాగా అమలు చేస్తున్నదని ఆనుమానం వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లలో నగరంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించని సర్కార్, హైడ్రా పేరిట వేలాది ఇండ్లను నేలమట్టం చేసిందని ధ్వజమెత్తారు.
బిల్లులివ్వకుండానే పాలాభిషేకమా?
బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బిల్లులు విడుదల చేయకుండానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బిల్లులు రాక ఆదిలాబాద్, తొర్రూరు, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లోని బైస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రోడ్డెక్కి ఆందోళనలకు దిగినా సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. బిల్లులు రాకపోవడంతో ఓ స్కూల్ హెచ్ఎం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట గురుకులాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కలెక్షన్స్..పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్‌లా రేవంత్‌రెడ్డి పాలన ఉన్నదని ఎద్దేవాచేశారు. సర్కార్ తీరు మారకుంటే సచివాలయాన్ని ముట్టడించేందుకు బీఆర్ఎస్ వెనుకాడబోదని హెచ్చరించారు.