హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సలహాదారుల వ్యవస్థను వ్యతిరేకించి, కోర్టుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నియమించుకున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం మరోసారి రుజువైందని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే నచ్చిన వ్యక్తులను అడ్వైజర్లుగా నియ మించుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం చర్య ముమ్మాటికీ రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఇంతియాజ్ అహ్మద్, బీఆర్ఎస్ నేతలు కిశోర్‌గౌడ్, గోసుల శ్రీనివాస్, కురువ విజయ్‌కుమార్, రాంబల్నాయక్తో కలిసి ఎర్రోళ్ల మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి 14మంది సలహాదారులతో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. వారికి క్యాబినెట్ హోదా ఇచ్చి ప్రజాధనం వృథా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సలహాదార్లు ఎందుకని కేసీఆర్‌ను ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడు నిస్సిగ్గుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
సలహాదారుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కోర్టు తలుపుతట్టామని పేర్కొన్నారు. కచ్చితంగా న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. పారదర్శకంగా అడ్వైజర్లను పెట్టుకుంటే ఆ జీవోలు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఏడాదిన్నరపాటు 11మంది మంత్రులతోనే నెట్టుకొచ్చిన రేవంత్, ఇప్పుడు పనికిరాని రాజకీయ ని రుద్యోగులకు పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అర్టికల్ 164 (1ఏ) ప్రకారం క్యాబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేశారు. వెంటనే సలహాదారులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న రేవంత్‌రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తడానికి అనర్హుడని విమర్శించారు.